KBR park: తొమ్మిదేళ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్న కేబీఆర్ పార్కు 'గొలుసు' దొంగ అరెస్ట్!
- ఎట్టకేలకు చిక్కిన దొంగ నర్సింహ
- ఇద్దరు హీరోలు చెప్పిన వివరాలతో పోలీసుల పని సులువు
- దొంగలను గుర్తించిన తెలుగు చిత్ర నటులు
- తొమ్మిదేళ్లుగా 11 స్నాచింగ్ లు... లెక్కలోకి రానివి ఎన్నో?
గడచిన 9 సంవత్సరాలుగా హైదరాబాద్ పోలీసులను ముప్పుతిప్పులు పెడుతూ తప్పించుకు తిరుగుతున్న ఘరానా 'గొలుసు' దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు ఆరు కిలోమీటర్ల పరిధిలో ఉండే కేబీఆర్ పార్కులో నడకకు వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని 11 స్నాచింగ్ లు చేసిన మహబూబ్ నగర్ కు చెందిన నర్సింహ (29) పోలీసులకు చిక్కాడు. దాదాపు 44 తులాల బంగారు గొలుసులను లాక్కెళ్లిన ఇతన్ని పార్కులో ఉన్న 90 సీసీటీవీ కెమెరాలు పట్టించలేకపోగా, ఇద్దరు సెలబ్రిటీలు, చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
దాదాపు 15 మంది పోలీసులు మఫ్టీలో పార్కు వద్ద కాపలా కాస్తున్నా, వారెవరికీ కనిపించకుండా మహిళల మెడల్లోని గొలుసులను లాక్కెళ్లి పారిపోతుండేవాడు. ఎవరికీ అనుమానం రానంత నిదానంగా పార్కులోకి వెళ్లడం, ఆపై టార్గెట్ ను ఎంపిక చేసుకుని దొంగతనం చేసేవాడు. ఈ సంవత్సరం జూలై 19న సుశీలాదేవీ అనే వృద్ధ మహిళ నుంచి నర్సింహ గొలుసును లాక్కెళ్లాడు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా స్కెచ్ గీయించారు.
దాన్ని వాకింగ్ కు వచ్చే వారికి చూపుతుండగా, ఇద్దరు సినీ హీరోలు అవే పోలికలతో ఉండే వ్యక్తి తరచూ కనిపించేవాడని చెప్పారు. దీంతో నర్సింహ కోసం కాపుకాసి, అతన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. మెయిన్ గేటు నుంచి కాకుండా గ్రిల్స్ దూకి లోపలికి వస్తాడు కాబట్టే నర్సింహను అరెస్ట్ చేయడానికి సమయం పట్టిందని పోలీసులు తెలిపారు. వెలుగులోకి రాని అతని మిగతా నేరాలపై విచారణ జరుపుతున్నామని అధికారులు పేర్కొన్నారు.