Gautam Bambawale: పాకిస్థాన్ టు చైనా.. డ్రాగన్ కంట్రీకి రాయబారిగా గౌతం బంబావాలె!
- పాక్ రాయబారిగా అజయ్ బిసారియా
- విదేశాంగ కార్యదర్శిగా అజయ్ గోఖలే
- జైశంకర్ పదవీ కాలం పొడిగింపుపై కొనసాగుతున్న సందిగ్ధత
పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్ గౌతమ్ బంబావాలె చైనా రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం పోలండ్‌లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న అజయ్ బిసారియా పాకిస్థాన్‌కు కొత్త హైకమిషనర్‌గా వెళ్లనున్నట్టు సమాచారం.
కాగా, ఇప్పటివరకు చైనాకు భారత రాయబారిగా ఉన్న విజయ్ గోఖలే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (ఎకనమిక్ రిలేషన్స్)గా నియమితులవనున్నారు. దీంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయడం ఆవశ్యకమైంది. ఇటీవల చైనాతో నెలకొన్న డోక్లాం వివాదాన్ని పరిష్కరించడంలో గోఖలే కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించకుంటే గోఖలే ఆ స్థానంలో నియమితులు కావడం దాదాపు ఖరారైంది.
బంబావాలె, బిసారియా ఇద్దరూ అసాధారణ వ్యక్తులే. సున్నిత విషయాలను పరిష్కరించడంలో ఇద్దరూ దిట్టలే. గతంలోనూ ఎన్నో సమస్యలను పరిష్కరించారు. 1984 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అధికారి అయిన బంబావాలె ఈస్ట్ ఏషియా డివిజన్లో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు జాయింట్ సెక్రటరీగా పనిచేసి ఎక్కువ కాలం ఈ పదవిలో ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 1987 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన బిసారియాకు దౌత్యవేత్తగా చక్కని పేరుంది. రష్యా, సెంట్రల్ ఆసియా దేశాలు ఆయనను నిపుణుడిగా గుర్తించాయి.