Chief Minister: నిప్పుతో చెలగాటమొద్దు.. ఆరెస్సెస్, వీహెచ్‌పీలకు మమతా బెనర్జీ వార్నింగ్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆరెస్సెస్, వీహెచ్‌పీలకు స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశారు. దుర్గా పూజ సమయంలో శాంతికి విఘాతం కలిగించి నిప్పుతో చెలగాటం ఆడవద్దని ఆరెస్సెస్, భజరంగ్ దళ్, వీహెచ్‌పీ సంస్థలను హెచ్చరించారు. విజయ దశమి వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం లేదని, మండపాలు, ఇళ్లలో కూడా జరుపుకోకుండా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కొన్ని సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మవద్దని సీఎం కోరారు. విజయదశమి ఉత్సవాలపై ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించడం లేదని స్పష్టం చేశారు.
’’ఆరెస్సెస్, భజరంగ్ దళ్, వీహెచ్‌పీలు శాంతికి విఘాతం కలిగించి నిప్పుతో ఆటలు ఆడవద్దని నా విజ్ఞప్తి’’ అని మమత పేర్కొన్నారు. దుర్గా పూజను లక్షలాది మంది ప్రజలు ఆనందోత్సాహాలతో, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని అన్నారు. కాబట్టి ఈ వేడుకల సందర్భంగా శాంతికి విఘాతం కలిగించవద్దని హితవు పలికారు.