facebook: విజయవాడ డాక్టర్ ను ఫేస్'బుక్' చేసిన యువతి!
- ఫేస్ బుక్ లో లండన్ మహిళగా పరిచయం
- కలిసేందుకు వస్తున్నానని వెల్లడి
- ఢిల్లీలో ఉన్నానని, ఇండియన్ కరెన్సీ కావాలని మాయమాటలు
- నమ్మి మోసపోయిన విజయవాడ డాక్టర్
విజయవాడకు చెందిన ఓ వైద్యుడిని తన మాయమాటలతో మోసం చేసి రూ. 4.88 లక్షలు బుట్టలో వేసుకుందో మహిళ. పటమట పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, అయ్యప్పనగర్ కు చెందిన కృష్ణమూర్తి డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. రెండు నెలల కిందట ఆయనకు లండన్ వాసినంటూ ఓ మహిళ పరిచయం అయింది. ఆపై ఇద్దరి మధ్యా నిత్యమూ చాటింగ్ జరిగింది. కృష్ణమూర్తిని కలిసేందుకు తాను విజయవాడకు వస్తున్నట్టు ఆమె తెలిపింది. ఆపై ఈ నెల 15వ తేదీన, తాను ఢిల్లీకి చేరుకున్నానని, విజయవాడకు విమానం టికెట్ కొనుగోలు చేయాలంటే, ఇండియన్ కరెన్సీ కావాలని అడుగుతున్నారని, తన వద్ద 20 వేల పౌండ్లు మాత్రమే ఉన్నాయని ఫోన్ చేసి వాపోయింది.
మరో వ్యక్తితో ఫోన్ చేయించి విదేశీ కరెన్సీతో వచ్చిన ఓ మహిళ ఏడుస్తోందని చెప్పించింది. తనకు ఇండియన్ కరెన్సీ కావాలని ఆమె వేడుకోవడంతో కృష్ణమూర్తి ఆమె చెప్పిన ఖాతాకు డబ్బు పంపాడు. తనకు మరుసటి రోజుకు విమానం టికెట్ దొరికిందని చెప్పి, ఖర్చులకంటూ ఇంకాస్త డబ్బు అడిగింది. మొత్తం రూ. 4.88 లక్షలు ఆమె ఖాతాలో వేశాడు. ఆపై ఆమె నుంచి సమాచారం లేకపోవడం, ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ వంటి ఉన్నత చదువులు చదివిన వారికి కూడా విమానాశ్రయాల్లో విదేశీ కరెన్సీని సులువుగా మార్చుకోవచ్చని, విమానం టికెట్లు విదేశీ కరెన్సీతో కొనుగోలు చేయవచ్చన్న పరిజ్ఞానం లేకపోవడంపై పోలీసు అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.