flipkart: భారీ ఆఫర్లతో రూ. 10 వేల కోట్లపై కన్నేసిన ఈ-కామర్స్ సంస్థలు!
- పండగ సీజన్ అమ్మకాలు భారీగా పెరుగుతాయని అంచనా
- గత సంవత్సరంతో పోలిస్తే 60 శాతం పెరగనున్న విక్రయాలు
- వెల్లడించిన రెడ్ సీర్ కన్సల్టింగ్
- రూ. 26 వేల కోట్ల విలువైన ప్రొడక్టులను సిద్ధం చేసుకున్న ఫ్లిప్ కార్ట్
- 20 నుంచి మొదలు కానున్న డిస్కౌంట్ అమ్మకాలు
ఈ దసరా, దీపావళి సీజన్ లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తూ, 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,800 కోట్లు) వ్యాపారం నిర్వహించాలని ఈ-కామర్స్ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, పేటీఎం మాల్ తదితర కంపెనీలు కోట్లాది ప్రొడక్టులను తమ తమ ఆన్ లైన్ వేదికలపై ఇందుకోసం సిద్ధం చేశాయని విశ్లేషణా సేవల సంస్థ రెడ్ సీర్ కన్సల్టింగ్ పేర్కొంది.
గత సంవత్సరంతో పోలిస్తే 60 శాతం ఎక్కువగా ఈ సంవత్సరం వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. గత సంవత్సరం ఇదే పండగ సీజన్ లో ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు 1.05 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని నమోదు చేశాయి. ఆపై మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేసిన ఫ్లిప్ కార్ట్ టెన్సెంట్, సాఫ్ట్ బ్యాంక్, ఈబే వంటి సంస్థల నుంచి నిధులను పొంది బలపడింది. ఈ సంవత్సరం దాదాపు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 26 వేల కోట్లు) విలువైన ప్రొడక్టులను సీజన్ కోసం రెడీ చేసుకుంది.
ఇక అమెజాన్ విషయానికి వస్తే, ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ పేరిట ఎంతో మంది విలువైన కస్టమర్ల బేస్ ను కలిగున్న సంస్థ అలీబాబా ప్రోత్సాహంతో ముందడుగు వేస్తోంది. ఈ సంవత్సరం ఆన్ లైన్ అమ్మకాల్లో పాత రికార్డులు కనుమరుగవుతాయని రెడ్ సీర్ సీఈఓ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తుండటమే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ-కామర్స్ సంస్థల్లో 50 శాతం అమ్మకాలు స్మార్ట్ ఫోన్ల రూపంలోనే సాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ నెల 20 నుంచి ఫ్లిప్ కార్ట్ సంస్థ 'బిగ్ బిలియన్ సేల్' పేరిట ప్రత్యేక అమ్మకాలు ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అమెజాన్ సైతం 21 నుంచి ఇదే తరహా విక్రయాలను మొదలు పెట్టనుంది. ఇక దక్షిణాదికి మరింత వేగంగా తన ప్రొడక్టులను అందించే దిశగా ఇటీవలే హైదరాబాద్ లో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెజాన్ ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ ను ప్రారంభించడం ఆ సంస్థకు ప్లస్ పాయింట్ గా మారనుంది.