Facebook: ఫేస్బుక్ ఓపెన్ చేయకూడదని చెప్పినందుకు.. చాలా కోల్పోతున్నానని రాసి బాలిక ఆత్మహత్య
- కోల్‌కతాలోని హబ్రా పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన
- పదకొండో తరగతి చదువుతోన్న బాలిక
- వాట్సప్ స్టేటస్‌లో ఐయామ్ డెడ్ అని పెట్టిన వైనం
ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలకు ఎంతో మంది పిల్లలు, యువత ఎంతగా బానిసలుగా మారిపోయారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఫేస్బుక్ వంటి మాధ్యమాలే తమ లోకంగా బతికేస్తున్నారు. బయటకు వెళ్లి ఆటలు ఆడకపోవడం, బంధువులతో కలిసి మెలసి ఉండలేకపోతుండడంతో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉండలేకపోతున్నారు. ఫేస్‌బుక్‌కి బానిసగా మారిన ఓ అమ్మాయి, అది వాడకూడదంటూ కుటుంబ సభ్యులు తిట్టడంతో ఆత్మహత్య చేసుకన్న ఘటన కోల్‌కతాలోని హబ్రా పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఆ బాలిక ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు తెలిపారు. ఆమె పదకొండో తరగతి చదువుతోందని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని అన్నారు. ఆమెకు స్మార్ట్‌ఫోన్ కొనిచ్చినప్పటి నుంచి చదువుపై శ్రద్ధ వహించడం లేదని, కాలేజీకి కూడా వెళ్లట్లేదని ఆమె తల్లి తెలిపింది. ఆహారం కూడా సరిగా తీసుకోవడం లేదని బాధపడింది. ఆ అమ్మాయి ఇటీవలే తన వాట్సప్ స్టేటస్‌లో ఐయామ్ డెడ్ అని పెట్టింది. తన జీవితంలో ఎన్నో కోల్పోతున్నానని ఫేస్బుక్లో రాసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.