venkaiah: ప్రపంచ ఏడు వింతలకు కొత్త అర్థం చెప్పి, రాజమౌళిని ప్రశంసల్లో ముంచెత్తిన వెంకయ్య నాయుడు
- హైదరాబాద్ శిల్ప కళా వేదికలో ఉప రాష్ట్రపతి ప్రసంగం
- చూడడం, వినడం, స్పర్శ, రుచి, అనుభూతి, నవ్వడం, ప్రేమించడం ఏడు అద్భుతాలు
- వాటిని మహాద్భుతంగా చూపించగలిగేది సినిమా
- సినిమాను మరింత అద్భుతంగా చూపించగలిగేవాడు రాజమౌళి
ప్రపంచ ఏడు వింతలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తనదైన శైలిలో కొత్త అర్థం చెప్పారు. ఈ రోజు హైదరాబాద్ శిల్ప కళా వేదికలో అక్కినేని నాగేశ్వర రావు జాతీయ పురస్కారాన్ని దర్శకుడు రాజమౌళికి అందించిన తరువాత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. తాను ఇక్కడకు వచ్చే ముందు తన మనవరాలు వైష్ణవి తనకు ఓ వాట్సప్ మెసేజ్ పంపించిందని అన్నారు. అందులో ఓ టీచర్ తన విద్యార్థులను ప్రపంచ ఏడు వింతల పేర్లు చెప్పమంటుందని అడుగుతుందని అన్నారు.
విద్యార్థులంతా ఈజిప్ట్ పిరమిడ్లు, తాజ్ మహల్ అంటూ ఇలా ఏడు చెబుతారని వెంకయ్య నాయుడు అన్నారు. ఒకమ్మాయి మాత్రం సమాధానం ఇవ్వకుండా అలాగే ఉండిపోయిందని అన్నారు. ఆమె తన టీచర్‌తో చివరకు ప్రపంచంలో అద్భుతాల్లో ఒకటి చూడగలగడం, రెండు వినగలగడం, మూడు స్పర్శ, నాలుగు రుచి, ఐదు అనుభూతిని పొందడం, ఆరు నవ్వడం, ఏడు ప్రేమించడం అని చెబుతుందని అన్నారు.
ఈ ఏడు అద్భుతాలను కూడా మహాద్భుతంగా చూపించగలిగేది సినిమా అని వెంకయ్య నాయుడు అన్నారు. అటువంటి సినిమాను మరింత అద్భుతంగా చూపించగలిగే దర్శకుడు రాజమౌళి అని వ్యాఖ్యానించారు. రాజమౌళి చిన్న వయసులోనే ఎంతో పేరు సంపాదించుకున్నాడని అన్నారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అక్కినేని పురస్కారాన్ని రాజమౌళికి ఇవ్వడం సముచితమని తెలిపారు.