n.korea: ఉత్తర కొరియాకు మొదలైన కష్టాలు.. ఆ దేశ దౌత్యవేత్తలపై కువైట్ వేటు!
- ఉ.కొరియాపై ఆంక్షలు విధిస్తూ ఇటీవలే ఐక్యరాజ్యసమితిలో తీర్మానం
- కువైట్లోని ఉ.కొరియా రాయబారి, మరో నలుగురు దౌత్యవేత్తలపై వేటు
- చైనా, రష్యాల కంటే గల్ఫ్ దేశాల ద్వారానే ఉత్తరకొరియాకు అధిక ఆదాయం
వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఉత్తరకొరియాకు కష్టాలు మొదలయ్యాయి. ఉత్తరకొరియాపై ఆంక్షలు విధిస్తూ ఇటీవలే ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తీర్మానాన్ని ఆమోదించిన విషయం విదితమే. ఆ దేశం తీరుపై కువైట్ కఠిన చర్యలు తీసుకుంది. కువైట్లోని ఉత్తరకొరియా రాయబారి, మరో నలుగురు దౌత్యవేత్తలను పంపించేస్తోంది. గల్ఫ్ దేశాలన్నింటిలో ఉత్తరకొరియాకు కువైట్ ఎంతో ముఖ్యమైన దేశం. ఎందుకంటే ఆ దేశాల్లో ఉత్తరకొరియాకు కువైట్ లో మాత్రమే ఎంబసీ ఉంది.
ఆ దేశంలో పాటు ఒమన్, ఖతార్, యూఏఈలలో కూడా ఉత్తరకొరియా ప్రజలు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వుంటున్నారు. వారి ద్వారా ఉత్తరకొరియాకు అధిక ఆదాయం వస్తోంది. చైనా, రష్యా వంటి దేశాలతో పోల్చి చూస్తే గల్ఫ్ దేశాల ద్వారానే ఉత్తరకొరియాకు అధిక ఆదాయం ఉంది. కువైట్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడంపై ఉత్తరకొరియా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.