team india: చేపాక్‌లో దుమ్మురేపిన భార‌త్‌.. తొలి వ‌న్డేలో భార‌త్ ఘ‌న‌విజ‌యం!

  1. పాండ్యా, ధోనీల వీర బాదుడు
  2. ఆట‌కు వ‌ర్షం అడ్డంకి
  3. చిన్న‌దైన ల‌క్ష్యం.. అయినా భార‌త్‌దే విజ‌యం
  4. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' పాండ్యా 

ఆస్ట్రేలియాతో ఆదివారం చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 281 ప‌రుగులు చేయ‌గా వ‌ర్షం కార‌ణంగా ఆసీస్ ఇన్నింగ్స్‌కు అంత‌రాయం క‌లిగింది. దీంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప్ర‌కారం మ్యాచ్‌ను 21 ఓవ‌ర్ల‌కు కుదించి ఆసీస్ విజ‌య ల‌క్ష్యాన్ని 164 ప‌రుగులుగా నిర్ణయించారు. స్వ‌ల్ప విజ‌యల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ నిర్ణీత 21 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 137 ప‌రుగులు మాత్ర‌మే చేసి 26 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. దీంతో ఐదు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

భార‌త బౌల‌ర్ల దెబ్బ‌కు ఆసీస్ బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ్డారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ల‌లో డేవిడ్ వార్న‌ర్ (25), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (39), జేమ్స్ ఫాల్క‌న‌ర్ (32) మాత్ర‌మే రాణించారు. మిగ‌తా వారు ప‌ట్టుమ‌ని ప‌ది ప‌రుగులు కూడా చేయ‌లేక‌పోయారు. భార‌త బౌల‌ర్ల‌లో చాహ‌ల్ మూడు వికెట్లు నేల‌కూల్చ‌గా కుల్దీప్, పాండ్యాలు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు.

అంత‌కుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ ఆదిలోనే క‌ష్టాల్లో ప‌డింది. ర‌హానే (5), కోహ్లీ (0), మ‌నీశ్ పాండే(0)లు వ‌రుస‌గా అవుట‌య్యారు. 11 ప‌రుగుల‌కే మూడు కీల‌క వికెట్లు కోల్పోయి భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది. అయితే రోహిత్ శ‌ర్మ (28), కేదార్ జాద‌వ్ (40) చ‌క్క‌ని స‌మ‌న్వ‌యంతో ఆడుతూ జ‌ట్టును గట్టెక్కించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో కాసేపటికి రోహిత్‌, జాద‌వ్ కూడా వెంట‌వెంట‌నే అవుట‌వ‌డంతో 87 ప‌రుగుల‌కే టాపార్డ‌ర్ కుప్ప‌కూలి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో టీమిండియా మాజీ సార‌థి ధోనీ మ‌రోమారు అండ‌గా నిలిచాడు. క్రీజులో ఉన్న హార్ధిక్ పాండ్యాకు చక్క‌ని స‌హ‌కారం అందించ‌డంతో అత‌డు రెచ్చిపోయాడు. ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ముఖ్యంగా 37వ ఓవ‌ర్ వేసిన ఆడ‌మ్ జంపాకు చుక్క‌లు చూపించాడు. ఓవ‌ర్ రెండో బంతికి ఫోర్ కొట్టిన పాండ్యా ఆ త‌ర్వాత వ‌రుస‌గా మూడు సిక్స‌ర్లు బాదడంతో స్కోరు బోర్డు ప‌రుగులు తీసింది. మొత్తం 66 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో 83 ప‌రుగులు చేసి ఆసీస్ బౌల‌ర్ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు. పాండ్యా కెరీర్‌లో ఇదే అత్య‌ధిక స్కోరు!

పాండ్యా ఔట‌య్యాక ధోనీ బ్యాట్ ఝ‌ళిపించాడు. 88 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 79 ప‌రుగులు చేశాడు. చివ‌ర్లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో 30 బంతుల్లో 5 ఫోర్ల‌తో 32 ప‌రుగులు చేయ‌డంతో భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 281 ప‌రుగులు చేసింది. ఆసీస్ బౌల‌ర్ల‌లో క‌ల్ట‌ర్ నైల్ 3, స్టోయిన్స్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టగా ఫాల్క‌న‌ర్‌, జంపా చెరో వికెట్ తీసుకున్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ప్ర‌తిభ చూపిన పాండ్యాకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు ద‌క్కింది.

  • Loading...

More Telugu News