France: అమెరికన్ విద్యార్థులపై ఫ్రాన్స్‌లో యాసిడ్ దాడి.. పోలీసుల అదుపులో నిందితురాలు
ఫ్రాన్స్‌లో ఆదివారం సాయంత్రం అమెరికన్ విద్యార్థులపై యాసిడ్ దాడి జరిగింది. వారిపై దాడికి పాల్పడిన 41 ఏళ్ల మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోస్టన్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినులు ప్రాజెక్టు పని నిమిత్తం దక్షిణ ఫ్రాన్స్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతానికి వెళ్లేందుకు సెయింట్ చార్లెస్ స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తుండగా ఓ మహిళ వారిపై యాసిడ్ దాడికి పాల్పడింది.
బాటిల్‌లోని యాసిడ్‌ను వారిపై కుమ్మరించడంతో వారు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే యాసిడ్ వారి ముఖంపై పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత ఉగ్రదాడిగా అనుమానించిన పోలీసులు ఆ కోణంలో విచారించారు. అయితే మహిళకు మతిస్థిమితం లేదని తర్వాత గుర్తించారు. చికిత్స అనంతరం బాధితులను ఆదివారం డిశ్చార్జ్ చేశారు.