sadavarti lands: సదావర్తి భూముల వేలం... ఉత్కంఠగా సాగిన వైనం... చివరకు ప్రొద్దుటూరు వాసి పరం!
- గంట పాటు హోరాహోరీ సాగిన వేలం
- 60.30 కోట్లకు వేలం పాడిన సత్యనారాయణ రెడ్డి
- టీటీడీకి 37.90 కోట్ల లాభం
- రెండు రోజుల్లో టీటీడీకి 30.15 కోట్లు చెల్లించాలి
- 30.15 కోట్లు న్యాయస్థానానికి చెల్లించాల్సి ఉంటుంది
- తేడా వస్తే ఈ భూములు రెండో అత్యధిక ధర పాడిన వ్యక్తికి సొంతం
సదావర్తి భూముల వేలం ముగిసింది. సుమారు గంటపాటు సాగిన బహిరంగ వేలం ప్రక్రియ వ్యాపారవేత్తల నడుమ తీవ్ర ఉత్కంఠ నింపింది. చెన్నైలోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూములను కొనుగోలు చేసేందుకు సుమారు 25 మంది వ్యాపారవేత్తలు పోటీ పడ్డారు. రహస్య టెండర్ ద్వారా ఆరుగురు పోటీ పడగా, ఈ ప్రొక్యూర్ మెంట్ విధానం ద్వారా మరో ఇద్దరు పోటీ పడ్డారు. అయితే వీరంతా గరిష్ఠంగా 30 కోట్ల రూపాయలలోపు కోట్ చేయడం విశేషం. బహిరంగ వేలంలో మాత్రం నువ్వా? నేనా? అన్నట్టు దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో 60 కోట్ల 30 లక్షల రూపాయలకు టోకెన్ నెంబర్ 10గా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సత్యనారాయణ రెడ్డి సొంతం చేసుకున్నారు.
ఈ వేలంలో తొలిసారి 47 కోట్ల రూపాయలప్పుడు, రెండోసారి 57 కోట్ల రూపాయల వద్ద వేలానికి వచ్చిన వారు మౌనం దాల్చగా, గంటపాటు వేలం కొనసాగించడాన్ని ఆయన వ్యతిరేకించారు. అయితే చివరకు ఆయనే అత్యధిక ధరకు కొనుగోలు చేయడం విశేషం. కాగా, గతంలో 22 కోట్లకు ఈ భూములను కొనుగోలు చేయగా, తాజాగా జరిగిన బహిరంగ వేలంలో 60.30 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. అయితే ఈ మొత్తంలో సగం ధరను 48 గంటల్లో టీటీడీకి చెల్లించాల్సి ఉండగా, మిగిలిన మొత్తాన్ని న్యాయస్థానానికి చెల్లించాల్సి ఉంటుందని దేవాదాయ కమిషనర్ అనూరాధ తెలిపారు. ఈ మొత్తం చెల్లించడంలో సత్యనారాయణ రెడ్డి విఫలమైతే అతని తరువాత అత్యధిక ధరకు పాడిన వ్యక్తికి ఈ భూములను కట్టబెడతామని ఆమె స్పష్టం చేశారు.