sadavrti auction: సిద్ధపడే వచ్చాను...ఇంకా ఎక్కువైతే పాడే వాడిని కాదు!: సదావర్తి భూముల పాటగాడు సత్యనారాయణరెడ్డి
నిర్ణయించుకున్న ప్రకారమే కొనుగోలు చేశా
నిబంధనల మేరకు డబ్బు చెల్లిస్తా
తమిళనాడు వేసిన కేసుపై ఆందోళన లేదు
తమిళనాడు కేసు గెలిస్తే...నా డబ్బులు నాకు వస్తాయి
సదావర్తి భూములను 60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయించుకునే వేలంలో పాల్గొన్నానని ఆ భూములను దక్కించుకున్న సత్యనారాయణ రెడ్డి తెలిపారు. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో జరిగిన బహిరంగ వేలంలో 60.30 కోట్ల రూపాయలకు సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వేలంలో పాల్గొన్నానని తెలిపారు.
నిబంధనల ప్రకారం నడచుకుంటానని, ప్రస్తుతం సగం ధరను చెల్లిస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని ఆయన చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం ఈ భూములు తమకే చెందాలని సుప్రీంకోర్టులో వేసిన కేసు గురించి తనకు తెలుసని, సుప్రీంకోర్టు ఈ భూములు తమిళనాడుకు ఇస్తే, తన డబ్బులు తనకు వాపస్ వస్తాయని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో వ్యాపారం చేసినప్పుడు అంతా పారదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపారు. సుప్రీంతీర్పుపై తనకు ఆందోళన లేదని ఆయన స్పష్టం చేశారు.