railway new rule: రైళ్లలో నిద్రా సమయాల మార్పు.. రాత్రి 10- ఉదయం 6 మధ్యే నిద్ర!
- రాత్రి పది దాటిన తరువాతే పడుకోవాలి
- పగలు మధ్య బెర్త్ ఎత్తేసి పడుకుంటానంటే కుదరదు
- రైల్వే శాఖ కొత్త మార్గదర్శకాలు
రైళ్లలో రాత్రి పది గంటలు దాటిన తరువాత మాత్రమే నిద్రకు ఉపక్రమించాలని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. దాని వివరాల్లోకి వెళ్తే...నల్గొండకు చెందిన ఫార్మసిస్టు చిలుకూరి పరమాత్మ ‘తాను రైళ్లలో ప్రయాణాలు చేసిన సమయాల్లో మధ్య బెర్తు ప్రయాణికులతో ఎదురైన సమస్యల్ని’ దేశంలోని అన్ని రైల్వే జోన్లతోపాటు, ప్రధాని కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
గతంలో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జాము 6 గంటలకు ఉన్న నిద్రా సమయాలను కుదిస్తున్నట్టు పేర్కొంది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు నిద్రాసమయమని తెలిపింది. మిగిలిన సమయాలలో లోయర్, మిడిల్ బెర్త్ ప్రయాణికులు నిద్రపోతామని మొండికేస్తే కుదరదని తెలిపింది. అయితే అనారోగ్యంతో ఉన్నవారు, లేదా మహిళలు, వయసు పైబడిన వారి ఇబ్బందులను గుర్తించి ఇతర ప్రయాణికులు మసలుకోవాలని సూచించింది.