jiah khan: జియా ఖాన్ విషయంలో న్యాయం కోసం ప్రధానికి బహిరంగ లేఖ రాసిన జియా తల్లి
- హత్యను ఆత్మహత్యగా మార్చారు
- సీబీఐ పట్టించుకోవడం లేదు
- తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్న రబియా ఖాన్
2013లో మరణించిన బాలీవుడ్ నటి జియా ఖాన్ కేసు విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ఆమె తల్లి రబియా ఖాన్ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసింది. తన కూతురు కేసు విషయంలో సీబీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె లేఖలో పేర్కొంది. అలాగే తన కూతురిది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆత్మహత్యలా కనిపించేలా చేశారని ఆమె తెలిపింది. అందుకు జియా ఖాన్ ఒంటి మీదున్న గాయాలే నిదర్శనమని చెప్పింది. ఆ విషయాన్ని ధ్రువీకరించే ఫోరెన్సిక్ ఆధారాలు తన దగ్గర ఉన్నాయని రబియా ఖాన్ లేఖలో తెలియజేసింది.
తన కూతురి కేసులో విచారణ జరపడానికి సీబీఐ మొదట్నుంచి అనాసక్తి చూపిస్తోందని, వాళ్లు తలచుకుంటే జియా ఖాన్ హత్యకు సంబంధించి అన్ని రకాల ఆధారాలు కనిపెట్టగలరని, కాకపోతే వాళ్లు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించింది. జియా ఖాన్ ను చంపేసి, ఆత్మహత్యలా సృష్టించారని బ్రిటిష్ ఫోరెన్సిక్ నిపుణులు తేల్చిచెప్పారని ఆమె లేఖలో వివరించింది. `నిశ్శబ్ద్`, `గజిని`, `హౌస్‌ఫుల్` వంటి చిత్రాల్లో నటించిన జియా ఖాన్, సినిమా అవకాశాలు రాకపోవడంతో 2013లో ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్తలొచ్చాయి. అయితే ఆమెది ఆత్మహత్య కాదని, జియా బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పంచోలీ హత్య చేశాడని ఆమె తల్లి ఆరోపిస్తోంది.