kanche ilaiah: నన్ను రోడ్ల మీద కాల్చి పడేస్తా అంటూ వ్యాఖ్యానిస్తాడా?: టీజీ వెంకటేశ్ పై కంచ ఐలయ్య ఆగ్రహం
- నన్ను రోడ్ల మీద కాల్చి చంపొచ్చని టీజీ వెంకటేశ్ అన్నారు
- నేను రాసిన పుస్తకం సరైంది కాకపోతే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు
- బెదిరింపుల ధోరణి ఎందుకు?
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ తాను రాసిన పుస్తకంపై ఆర్యవైశ్యులు మండిపడుతూ, తనపై విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని కంచ ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘హైదరాబాద్లో నిర్వహించిన ఆర్యవైశ్య రౌండ్ టేబుల్ సమావేశంలో నన్ను రోడ్ల మీద కాల్చి చంపొచ్చని టీజీ వెంకటేశ్ అన్నారు. నా తెలంగాణ రాష్ట్రంలో నా మీద టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలు చేశాడు. టీజీ వెంకటేశ్ వ్యాపారి కావచ్చు.. ఆయన వద్ద చాలా డబ్బు ఉండొచ్చు.. ఎంపీ కావచ్చు.. నన్ను రోడ్ల మీద కాల్చి పడేస్తా అని వ్యాఖ్యలు చేస్తాడా? నన్ను ఏం చేసినా పాపం లేదని అంటున్నాడు. గౌరీ లంకేశ్ లాంటి వారిని చంపిన టీమ్ బహుశా టీజీ వెంకటేశ్ ఇంట్లో దాక్కుని ఉంటుంది’ అని ఐలయ్య వ్యాఖ్యానించారు.
‘నేను రాసిన పుస్తకం సరైంది కాకపోతే నా రాష్ట్ర ప్రభుత్వం దానిపై నిషేధం విధించవచ్చు. లేదా కోర్టు ఆర్డర్లతో పోలీసులు నన్ను అరెస్టు చేసుకోవచ్చు. నేనెప్పుడైనా చట్టబద్ధమైన చర్యలు వద్దన్నానా? ఒక మనిషిని చంపడానికి టీజీ వెంకటేశ్ పత్వా ఇచ్చారు.. నేను రాజ్యాంగ విరుద్ధంగా పుస్తకాలు రాస్తే దాన్ని నిషేధించడానికి కోర్టులు ఉన్నాయి, వీళ్లు ఇటువంటి బెదిరింపులకు దిగడమేంటి?’ అంటూ ఐలయ్య అడిగారు.