uk universities: యూకే యూనివర్సిటీల్లో చేరడానికి మొగ్గు చూపుతున్న దక్షిణ భారత విద్యార్థులు
- 9 శాతం పెరిగిన విద్యార్థి వీసా దరఖాస్తులు
- విజిటింగ్ వీసాల సంఖ్యలో కూడా పెరుగుదల
- వెల్లడించిన యూకే దౌత్యవేత్త
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించేందుకు దక్షిణ భారత దేశ విద్యార్థులు అధికంగా మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గతేడాది 9 శాతం పెరిగినట్లు చెన్నైలోని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ భరత్ జోషి తెలిపారు. అలాగే విజిటింగ్ వీసాల సంఖ్యలో నిర్ధిష్ట పెరుగుదల కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
యూకే వెళ్లడానికి జారీ చేస్తున్న వీసాల్లో 80 శాతం విజిటింగ్ వీసాలు కాగా, రెండో స్థానంలో వర్కింగ్ వీసాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. మార్చి 2017 వరకు 4.14 లక్షల వీసాలు జారీ చేయగా వీటిలో 11,700 స్టూడెంట్ వీసాలు, 5,000 షార్ట్‌టర్మ్ స్టడీ వీసాలు, 60,000ల వర్కింగ్ వీసాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికి రావడం వల్ల అక్కడి నియమాలు, నిబంధనల్లో చాలా మార్పు వచ్చిందని, అందుకే విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని జోషి వివరించారు.