jagan: పీకేతో సుదీర్ఘ మంతనాలు సాగించిన జగన్?
- విజయవాడలో పార్టీ కార్యాలయం ఉండాలన్న పీకే
- తాత్కాలిక కార్యాలయం కోసం నాయకులను ఆదేశించిన జగన్
- విజయవాడలో పార్టీ నేత స్థలంలో పనులు ప్రారంభం
- 27న ముహూర్తం
నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో ఆ పార్టీ అధినేత జగన్ సుదీర్ఘ మంతనాలు సాగించినట్టు సమాచారం. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్లను పీకే చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచే పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తే, పార్టీపై పార్ట్ టైమ్ అనే ముద్ర పడే అవకాశం ఉందని ఈ సందర్బంగా జగన్ కు పీకే చెప్పారు. ఈ నేపథ్యంలో, విజయవాడలో తాత్కాలిక కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేసేలా పార్టీ నేతలకు జగన్ ఆదేశించారు. తాను విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చే లోపు తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు.
ఈ నేపథ్యంలో, విజయవాడలోని బందరు రోడ్ లో స్వగృహ ఫుడ్స్ పక్కన తన పార్టీ నేతకు ఉన్న స్థలంలో పనులను ప్రారంభించారు. అయితే, ఈ అంశానికి సంబంధించిన వివరాలు మాత్రం అధికారికంగా బయటకు రావడం లేదు. ఈ నెల 27న తాత్కాలిక కార్యాలయానికి ముహూర్తం ఉంటుందని చెబుతున్నారు. జగన్ వచ్చిన తర్వాత ఫైనల్ చేస్తారని, ఆ తర్వాతే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.