srisailam: శ్రీశైలం జలాశయానికి తగ్గిపోయిన వరద!
- ఎగువన వర్షాలు లేక తగ్గిన ప్రవాహం
- 69 వేల క్యూసెక్కులకు పడిపోయిన వరద
- ప్రస్తుత నీటి మట్టం 861 అడుగులు
- మరో 20 అడుగులకు పైగా పెరిగితేనే గేట్లు తెరిచే అవకాశం
పైనుంచి శ్రీశైలానికి వస్తున్న వరద నీరు గణనీయంగా తగ్గిపోయింది. గడచిన రెండు మూడు రోజులుగా లక్ష క్యూసెక్కులకు పైగా సాగిన వరద ప్రస్తుతం 69 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో ఆల్మట్టి, జూరాలకు వరద తగ్గిందని, తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోకపోవడంతో అక్కడికి వస్తున్న నీటిని నిల్వ చేస్తున్నందున శ్రీశైలానికి వరద తగ్గిందని అధికారులు వెల్లడించారు.
కాగా, శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 861 అడుగుల నీరు ఉంది. నీటి నిల్వ 110 టీఎంసీలకు పెరగగా, పోతిరెడ్డి పాడు, హంద్రీనీవా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నామని, విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్ కు 15 వేల క్యూసెక్కుల నీరు వెళుతోందని అధికారులు తెలిపారు. ఈ ఉదయం ఆల్మట్టికి వస్తున్న ఇన్ ఫ్లో 25 వేల క్యూసెక్కులుగా ఉండగా, నారాయణపూర్ వద్దా అంతే మొత్తం ప్రవాహం నమోదైంది. తుంగభద్రకు 4,511 క్యూసెక్కుల నీరు వస్తోంది. నాగార్జున సాగర్ కు 15,300 క్యూసెక్కుల నీరు వస్తోంది. గడచిన వారం రోజుల వ్యవధిలో నాగార్జున సాగర్ లో 8 టీఎంసీల నీరు చేరింది.