most dangerous celebrity: మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీల జాబితా విడుదల చేసిన మెక్అఫీ
- ఇంటర్నెట్లో వీరి పేరు కొడితే వైరస్ రావడం ఖాయం
- మొదటిస్థానంలో అవ్రిల్ లావిన్యే
- మొదటిసారి జాబితాకు ఎక్కిన బ్రూనో మార్స్
ఇంటర్నెట్లో వీరి పేరు కొట్టి సెర్చ్ చేస్తే ఇక అంతే సంగతులు... మీ కంప్యూటర్‌కి వైరస్ రావడం పక్కా! అలా ఇంటర్నెట్లో వైరస్లు కలిగించే వెబ్‌పేజీలకు లింక్‌లు ఉన్న సెలబ్రిటీల జాబితాను సైబర్ సెక్యూరిటీ సంస్థ మెక్అఫీ విడుదల చేసింది. ఈ జాబితాలో పాప్ సింగర్ అవ్రిల్ లావిన్యే మొదటి స్థానంలో ఉంది. ఈమె పేరుతో సెర్చ్ చేస్తే 14.5 శాతం వైరస్ పేజీలకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని, 2013లో విడుదలైన ఈమె పాటల పేరుతో కలిపి సెర్చ్ చేస్తే 22 శాతం వైరస్ పేజీల లింక్‌కి వెళ్లే ప్రమాదముందని మెక్అఫీ తెలిపింది.
ఈ జాబితాలో బ్రూనో మార్స్ మొదటిసారి స్థానం సంపాదించాడు. బ్రూనో రెండో స్థానంలో నిలవగా, కార్లీ రే జాస్పన్, జేన్ మాలిక్, సెలీన్ డియోన్, కెల్విన్ హ్యారీస్, జస్టిన్ బీబర్, సీన్ డిడ్డీ, కేటీ పెర్రీ, బియాన్సేలు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సెలబ్రిటీల పేర్లను సెర్చ్ చేయడం ద్వారా వచ్చే అపరిచిత లింక్‌లను ఓపెన్ చేయవద్దని హెచ్చరించడానికే మెక్అఫీ 11 ఏళ్లుగా డేంజరస్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తోంది. అయితే ఈ జాబితాలో ఓ పాప్ సింగర్ మొదటిస్థానంలో నిలవడం ఇదే మొదటిసారి.