cyclist: 80 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన లండన్ సైక్లిస్ట్!
- రెండు గిన్నిస్ రికార్డులు సొంతం
- రోజుకి 18 గంటలు సైకిల్ తొక్కడమే పని
- 29000ల కి.మీ.లు సైకిల్ మీదే!
లండన్‌కు చెందిన సైక్లిస్ట్ మార్క్ బ్యూమాంట్ కేవలం సైకిల్ తొక్కుతూ ప్రపంచాన్ని 80 రోజుల్లో చుట్టివచ్చి గిన్నిస్ రికార్డులు సృష్టించాడు. రోజులో పద్దెనిమిది గంటలు సైకిల్ తొక్కుతూ ప్రయాణించి పొలాండ్, రష్యా, మంగోలియా, చైనా, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలను చుట్టివచ్చాడు. సైకిల్ మీదనే దాదాపు 29వేల కి.మీ.ల దూరాన్ని మార్క్ ప్రయాణించాడు.
యాత్ర ప్రారంభించిన తొమ్మిదో రోజే రష్యాలో మార్క్‌కి చిన్న యాక్సిడెంట్ అయింది. అయినప్పటికీ తన ప్రయాణాన్ని మార్క్ ఆపలేదు. కచ్చితంగా చెప్పాలంటే... ఈ యాత్రను మార్క్ 78 రోజుల 14 గంటల 40 నిమిషాల్లో పూర్తి చేశాడు. 2015లో 123 రోజుల్లో సైకిల్ మీద ప్రపంచయాత్ర చేసి న్యూజిలాండ్‌కి చెందిన ఆండ్రూ నికోల్సన్ సృష్టించిన రికార్డును మార్క్ బద్దలు కొట్టాడు. ఈ యాత్రతో మార్క్ రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఒకటి ప్రపంచ యాత్రకు కాగా, మరొకటి ఒక్క నెలలో సైకిల్ మీద ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు.