ak 47: మాస్కోలో ఏకే 47 రైఫిల్ సృష్టికర్త మిఖాలీ కలాష్నికోవ్ విగ్రహం ఆవిష్కరణ
రష్యా రాజధాని మాస్కోలో ఏకే 47 అసాల్ట్ రైఫిల్ సృష్టికర్త మిఖాలీ కలాష్నికోవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మిలటరీ స్వాగతాలతో వేడుక నిర్వహించి 30 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టారు. ఈ కార్యక్రమానికి రష్యా సాంస్కృతిక శాఖ మంత్రి వ్లాదిమిర్ మెదెన్స్కీ కూడా హాజరయ్యారు. 'ఏకే 47 రష్యా సంస్కృతికి చిహ్నం' అని మెదెన్స్కీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మాతృభూమిని రక్షించడానికి మిఖాలీ ఏకే 47ని కనిపెట్టాడని విగ్రహాన్ని ఆవిష్కరించిన ఫాదర్ కొనస్టాంటిన్ అన్నారు.
రష్యన్ మిలటరీలో ట్యాంక్ కమాండర్‌గా పనిచేసిన మిఖాలీ, ఆయుధాల్లో నాణ్యత లేదని సోవియట్ సైనికులు ఫిర్యాదు చేయడంతో వారి కోసం ప్రత్యేకంగా ఏకే 47ని రూపొందించాడు. 1947లో ఏకే 47 మొదటి మోడల్ విడుదలైంది. దీన్ని తయారుచేసినందుకు మిఖాలీకి స్టాలిన్ ప్రైజ్, ఆర్డర్ ఆఫ్ రెడ్ స్టార్‌లను రష్యా ప్రభుత్వం బహూకరించింది.
కాగా, నేడు ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ఏకే 47లు వాడుకలో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ దేశాల ఆర్మీలు, తీవ్రవాద గ్రూపులు ఈ ఆయుధాన్ని విరివిగా వాడుతున్నాయి. దీని కారణంగా ఏడాదికి 2,50,000ల మంది చనిపోతున్నారని అంచనా. అంతేకాకుండా మొజాంబిక్, హెజ్‌బొల్లా దేశాలు తమ జాతీయ పతాకాల్లో ఏకే 47 బొమ్మలను పెట్టుకున్నాయి.