ND Tiwari: సీనియర్ రాజకీయ వేత్త, ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ పరిస్థితి విషమం!
- బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రికి
- రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత
- ఉమ్మడి ఏపీకి గవర్నర్‌గా సేవలు
సీనియర్ రాజకీయ వేత్త ఎన్డీ తివారీ పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురి కావడంతో వెంటనే ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్చినట్టు ఆయన మేనకోడలు మనీషి తివారీ తెలిపారు.
తివారీ (91) పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అబ్జర్వేషన్లో ఉన్నారని వైద్యులు తెలిపారు. ఉదయం టీ తాగుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని తివారీ కుమారుడు రోహిత్ తెలిపారు.
రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడిగా నారాయణ్ దత్ తివారీ రికార్డు సృష్టించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. రాజీవ్‌గాంధీ కేబినెట్లో విదేశీ వ్యవహరాల మంత్రిగానూ పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సేవలందించారు. అయితే సెక్స్ కుంభకోణంలో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ నాయకుడైన ఆయన ఈ ఏడాది మొదట్లో కుమారుడు రోహిత్‌తో కలిసి బీజేపీలో చేరారు.