Beverly Hills: ఆ వాటర్ బాటిల్ ధర తెలిస్తే గుండె గుభేల్ మనక తప్పదు.. జస్ట్ రూ.65 లక్షలే!
- భారత మార్కెట్లోకి బేవెర్లీ హిల్స్
- 5500 ఎత్తు నుంచి నీటి సేకరణ
- బాటిల్ కూడా ప్రత్యేకమే
ఏంటండీ ఇది.. మరీ విడ్డూరం కాకపోతే.. నీళ్ల బాటిల్ ధర రూ.65 లక్షలేంటి? ఎవరైనా నవ్విపోతారు.. అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే సాధారణంగా ఏ కంపెనీ వాటర్ బాటిల్ ధర అయినా మార్కెట్లో రూ.15-20 వుంటుంది. రైల్వే, బస్ స్టేషన్లలో అయితే మరో ఐదు రూపాయలు ఎక్కువుండచ్చు. ఇక మంచి కంపెనీ వాటర్ బాటిల్ అయితే రూ.50 నుంచి రూ.100 వరకు ఉండొచ్చు. కానీ ఇలా లక్షల్లో ఏంటి? అన్న అనుమానం వస్తే మాత్రం ఇది చదవాల్సిందే.
అమెరికాకు చెందిన ద బేవెర్లే హిల్స్ అనే పానీయాల కంపెనీ త్వరలో భారత మార్కెట్లో అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా లగ్జరీ వాటర్ బాటిళ్లను తీసుకురావాలని నిర్ణయించింది. 90H2O పేరుతో వస్తున్న ఈ బాటిల్ ఖరీదు అక్షరాల అరవై ఐదు లక్షల రూపాయలు. దీనికి ఎందుకు అంత ధరంటే.. ఇందులోని నీటిని దక్షిణ కాలిఫోర్నియాలోని పర్వత ప్రాంతాల్లో 5500 అడుగుల ఎత్తునుంచి పడుతుంటే సేకరిస్తారు.
ఈ నీరు చాలా స్వచ్చంగా, గమ్మత్తయిన రుచితో అద్భుతంగా ఉంటుందని బేవెర్లీ హిల్స్ కో ఫౌండర్ జాన్ గ్లుక్ తెలిపారు. ఇక ఈ బాటిల్ కూడా ప్రత్యేకమే. బాటిల్‌పై అరుదైన వజ్రాలు పొదిగారు. మూతను ప్లాటినంతో తయారు చేశారు. బాటిల్‌పై మొత్తం 14 కేరెట్ల విలువైన 250 నల్ల వజ్రాలను పొదిగారు. అయితే ఈ బాటిల్ అందరికీ అమ్మేందుకు కాదండోయ్. లైఫ్‌స్టైల్ ఎడిషన్‌లో భాగంగా వీటిని పరిమితంగా విక్రయించనున్నారట. అంతేకాదండోయ్.. ఈ కంపెనీ ‘వరల్డ్స్ బెస్ట్ వాటర్ అవార్డు’ కూడా అందుకుంది.