odisa: సారీ.. మీ ఇంటికొచ్చామా?: నాలుక్కరుచుకున్న సీబీఐ అధికారులు!
- విశ్రాంత న్యాయమూర్తి ఇంటికి బదులు ప్రస్తుత న్యాయమూర్తి ఇంటికి
- సోదాలంటూ, అధికారాన్ని చూపి పప్పులో కాలేసిన సీబీఐ
- తీవ్రంగా మండిపడ్డ ఒడిశా బార్ అసోసియేషన్
- అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
విశ్రాంత న్యాయమూర్తి ఇంటికి వెళ్లి సోదాలు జరపాల్సిన సీబీఐ అధికారులు, సిట్టింగ్ జడ్జి ఇంటికి వెళ్లి తిట్లు తిన్నారు. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్ లో జరిగింది. అవినీతి నిరోధక చర్యల పేరిట సీబీఐ బృందాలు పలు చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ, ఓ పదవీ విరమణ చేసిన జడ్జి ఇంటికి సోదాలకు బయలుదేరారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. ఒక ఇంటికి వెళ్లాల్సిన అధికారులు, తప్పుటడుగులు వేశారు. ఏకంగా ప్రస్తుత న్యాయమూర్తి సీఆర్ దాస్ ఇంటికి వెళ్లి తమ అధికారాన్ని చూపించారు.
ఆపై విషయం తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీబీఐ నిర్వాకం గురించి ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ ఒకింత ఘాటుగానే స్పందిస్తూ, తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సిట్టింగ్ జడ్జి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులపై జ్యుడీషియల్ దర్యాఫ్తు చేయాల్సిందేనని తీర్మానించింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ విధులను బహిష్కరిస్తామని పేర్కొంది. రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు సదరు న్యాయమూర్తితో భేటీ అయి, జరిగిన విషయం గురించి ఆరాతీశారు. ఈ ఘటన విచారకరమైనదని, సీబీఐ అదికారులపై శాఖా పరమైన విచారణతో పాటు క్రిమినల్ చర్యలు చేపట్టాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.