Karnataka: దొంగలందు మంచి దొంగలు వేరయా... బ్యాంకులో డిపాజిట్ చేసుకోమని చోరుల సలహా!
- మంగళూరులో మంచిదొంగలు
- అంత బంగారం ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని సలహా
- అవాక్కయిన కుటుంబం
దొంగల్లో మంచి, చెడు అనే రకాల వారు కూడా ఉంటారా? కచ్చితంగా ఉంటారనే అంటున్నారీ దొంగలు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన శేఖర్ కుందర్, ఆయన భార్య తిలోత్తమ విధులకు వెళ్లిన తర్వాత వెనక గేటు నుంచి దొంగలు వారింట్లోకి చొరబడి బంగారం, డబ్బు దోచుకుపోయారు. 99 బంగారు నాణేలు, రూ.13 వేల నగదు ఎత్తుకెళ్లారు. విధుల నుంచి ఇంటికొచ్చిన దంపతులు ఇంట్లో దొంగలు పడిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు శేఖర్ కుందర్ ఇంట్లోకి ఓ ప్యాకెట్‌ను విసిరేసి వెళ్లిపోయారు. ఆ ప్యాకెట్‌ను విప్పి చూసిన శేఖర్ దంపతులు ఆశ్చర్యానికి గురయ్యారు. అందులో చోరీకి గురైన బంగారు నాణేలు, డబ్బు ఉన్నాయి. వాటితో పాటు ఓ లేఖ కూడా ఉంది. అందులో.. పెద్ద మొత్తంలో డబ్బు, బంగారాన్ని ఇంటిలో దాచుకోవడం మంచిది కాదని, వెంటనే వాటిని బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలని సూచించడంతో అవాక్కవడం వారి వంతైంది. డబ్బు, బంగారం దొంగిలించి తప్పు చేసినట్టు ఆ లేఖలో దొంగలు పశ్చాత్తాపం వెలిబుచ్చడం కొసమెరుపు.