cartoonist mohan: తెలుగు కార్టూనిస్టుల మార్గదర్శి మోహన్ కన్నుమూత!
- కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- 1970 నుంచి పత్రికా రంగంలో మోహన్
- వ్యంగ్య కార్టూన్లు గీయడంలో దిట్ట
ప్రముఖ కార్టూనిస్టు, ఎందరో తెలుగు కార్టూనిస్టులను తీర్చిదిద్దిన మోహన్ కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు. 1970లో విశాలాంధ్ర పత్రికలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన ఆయన చివరిగా సాక్షి టీవీలో కార్టూన్ యానిమేషన్ విభాగంలో సేవలందించారు. ఆంధ్రప్రభ, ఉదయం పత్రికల్లో కూడా పనిచేశారు.
పొలిటికల్ కార్టూనిస్ట్ గా తెలుగు పత్రికా రంగంలో అపార ప్రతిభను చూపిన మోహన్, వ్యంగ్య చిత్రాలను గీయడంలో ప్రత్యేక శైలిని కనబరిచేవారు. ఆయన భౌతికకాయాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ హైదరాబాద్, సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఉంచుతామని, ఆపై అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.