teacher: ఎవరినీ అంతగా హింసించవద్దని వేడుకుంటూ చివరి లేఖ రాసి, ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
- క్లాస్ రూమ్ లో మూడు పీరియడ్ల పాటు విద్యార్థిని నించోబెట్టిన టీచర్
- ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న 11 ఏళ్ల నవనీత్ ప్రకాష్
- పోలీసు కేసు నమోదు
తరగతి గదిలో టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ తో తీవ్రంగా బాధపడిన ఓ ఐదో తరగతి విద్యార్థి, ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలోని గోరఖ్ పూర్ లో కలకలం రేపింది. విద్యా వ్యవస్థలో చిన్నారులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారన్న దానికి తాజా సాక్ష్యంగా నిలిచిన ఘటన పూర్వపరాల్లోకి వెళితే, 11 ఏళ్ల నవనీత్ ప్రకాష్ అనే విద్యార్థి సెయింట్ ఆంటోనీస్ కాన్వెంట్ స్కూల్ లో చదువుతూ, ఈ నెల 15న పరీక్షలకు వెళ్లాడు. ఆపై ఇంటికి వచ్చి ముభావంగా ఉండి, తరువాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
"దయచేసి ఎవరినీ ఇంత కఠినంగా హింసించవద్దని మా టీచర్ కు చెప్పండి" అని లేఖ రాసి పెట్టాడు. తరగతి గదిలో మూడు పీరియడ్ల పాటు ప్రకాష్ ను ఓ టీచర్ బెంచ్ పై నిలబెట్టినట్టు లేఖలో ప్రస్తావించాడు. టీచర్ వేధింపులతోనే తమ బిడ్డ దూరమైనాడని కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.