england: దుబాయా మజాకా?... మధ్య వేలు చూపించాడని ఆరు నెలల కఠిన కారాగార శిక్ష!
- పాశ్చాత్య దేశాల్లో మధ్య వేలు చూపించడం సర్వసాధారణం
- హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో కూడా ఇది సర్వసాధారణం
- తాజాగా టాలీవుడ్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో కూడా మధ్యవేలు చూపించిన ఘటనలు ఉన్నాయి
- మధ్య వేలు చూపించాడని ఇంగ్లండ్ వాసి దుబాయ్ లో అరెస్టు
- ఆరు నెలల కఠిన కారాగార శిక్ష
మధ్య వేలు పైకెత్తి చూపించినందుకు ఆరు నెలల కఠిన కారాగార శిక్షకు గురయ్యాడో బ్రిటన్ వాసి. ఆ వివరాల్లోకి వెళ్తే... పాశ్చాత్య దేశాల్లో ఎవరినైనా తిట్టాలనుకుంటే మధ్యవేలు పైకెత్తి చూపుతారన్న సంగతి తెలిసిందే. చాలా హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో ఈ సన్ని వేశం కనిపిస్తుంటుంది. ఇంగ్లండ్ లోని లీసెస్టర్ లో ఒక ప్రైవేటు కంపెనీ యజమాని అయిన జమీల్ ముక్దుమ్ (23) తన భార్యతో కలిసి ఈ ఫిబ్రవరిలో దుబాయ్ పర్యటనకు వెళ్లాడు. దుబాయ్ లో రోడ్డుపై నడుస్తుండగా ఒక ద్విచక్రవాహనదారు వేగంగా వచ్చి బాగా దగ్గరగా దూసుకెళ్లాడు.
దీంతో ఆందోళనతో ఆగ్రహానికి గురైన జమీల్ మధ్యవేలు చూపించాడు. దీనిపై ఆ మోటారు సైక్లిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే జమీల్ ఇంగ్లండ్ చేరిపోయాడు. గత వారం మరోసారి దుబాయ్ పర్యటనకు రాగా, అతనిని ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకి పంపారు. తర్వాత బెయిల్ పై రిలీజ్ అయిన జమీల్ మాట్లాడుతూ, తానేమీ ఘోరపాపం చేయలేదని అన్నాడు. ఇలాంటి సంఘటనలు ఇంగ్లండ్ లో సర్వసాధారణమని తెలిపాడు. ఈ మాత్రానికే జైలుకి పంపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా తాను చేసిన చిన్న నేరానికి రేపిస్టులు, మర్డరర్స్ ఉన్న సెల్ లో తనను వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.