rohingya muslims: రోహింగ్యా ముస్లింలను తిప్పి పంపించేస్తాం.. వారివల్ల దేశానికి ముప్పు: రాజ్ నాథ్
- రోహింగ్యాలు శరణార్థులు కాదు
- ఆశ్రయం కోరి మన దేశంలోకి రాలేదు
- వారితో దేశ భద్రతకు ముప్పు
- కొందరి అభ్యంతరాలను పట్టించుకోం
- మయన్మార్ కు తిప్పి పంపించేస్తాం
భారత్ లోకి ప్రవేశించిన రోహింగ్యా ముస్లింలు శరణార్థులు కాదని... వారంతా అక్రమ వలసదారులేనని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. వారిని తిరిగి మయన్మార్ కు పంపించేయాలనే కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. రోహింగ్యాలు ఆశ్రయం కోరి, మన దేశంలోకి ప్రవేశించలేదని... అక్రమంగా చొరబడ్డారని అన్నారు. రోహింగ్యాలను వెనక్కి పిలిపించుకోవడానికి మయన్మార్ సిద్ధంగా ఉన్నప్పటికీ, మన దేశంలోని కొందరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు.
ఎవరైనా శరణార్థిగా దేశంలో ప్రవేశించాలంటే ఓ ప్రక్రియ ఉంటుందని, రోహింగ్యాలు ఆ ప్రక్రియను పాటించలేదని రాజ్ నాథ్ తెలిపారు. 1951 ఐక్యరాజ్యసమితి శరణార్థి ఒప్పందంలో భారత్ చేరలేదని... ఈ నేపథ్యంలో, రోహింగ్యాలను మయన్మార్ కు తిప్పి పంపడం ద్వారా భారత్ ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడం లేదని అన్నారు. మరోవైపు, రోహింగ్యాలు దేశ భద్రతకు ముప్పుగా మారారని, ఈ కారణం వల్లే వారిని మయన్మార్ కు తిప్పి పంపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర హోం శాఖ సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.