women reservation bill: మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రధాని మోదీకి లేఖ రాసిన సోనియా
- 2010లో రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లు
- లోక్సభలో మెజార్టీని ఉపయోగించుకుని ఆమోదించాలని వినతి
- త్వరలోనే ఆమోదించే అవకాశం
2010 నుంచి లోక్సభ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తమ మెజార్టీని ఉపయోగించి ఆమోదం పొందేలా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. మార్చి 9, 2010న రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొందిన విషయాన్ని ఆమె గుర్తుచేస్తూ కొన్ని కారణాల వల్ల ఆ బిల్లు లోక్సభలో ఆగిపోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు లోక్సభలో మోదీ వర్గానికి అత్యంత మెజార్టీ ఉన్నందున ఎలాగైనా చొరవ తీసుకుని ఈ బిల్లుకు ఆమోదముద్ర వచ్చేలా చేయాలని ఆమె లేఖలో కోరారు.
మహిళా సాధికారతకు ఎంతగానో ఉపయోగపడే ఈ బిల్లు చట్టంగా మారటానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందని సోనియా పేర్కొన్నారు. అలాగే పంచాయతీ, నగర పాలక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ల గురించి రాజీవ్ గాంధీ చొరవ తీసుకోవడం కారణంగా 73, 74వ సవరణలు చేసిన సంగతిని ఆమె గుర్తుచేశారు. మొదట్నుంచి ఈ బిల్లు ఆమోదానికి చాలా పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే ఈ బిల్లు చట్టంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.