ssrajamouli: ఆ వార్తల్లో నిజం లేదు: ఏపీ సర్కారు తన సాయం తీసుకోవడంపై వస్తోన్న వార్తలపై రాజమౌళి ఆగ్రహం

  • నన్ను కన్సల్టెంట్, సూప‌ర్‌వైజ‌ర్‌, డిజైన‌ర్‌గా నియమించినట్లు వార్తలు వస్తున్నాయి
  • నిపుణులు ఇచ్చిన డిజైన్లు ఫ‌స్ట్ క్లాస్‌గా ఉన్నాయి
  • నేను చిరుసాయం చేస్తున్నాను.. అంతే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడితో దర్శకుడు రాజమౌళి నిన్న భేటీ అయిన విష‌యం తెలిసిందే. ఈ భేటీలో అమరావతిలో చేపట్టబోయే నిర్మాణాలపై రాజమౌళితో చంద్ర‌బాబు మాట్లాడారు. రాజమౌళి నుంచి సూచనలు తీసుకోవాలని సీఆర్డీఏ అధికారులకు చంద్రబాబు అంతకు ముందే సూచించారు. నిన్న రాజ‌మౌళి రాజ‌ధాని ప్రాంతంలో తిరిగి నిర్మాణాలను ప‌రిశీలించారు. ఈ క్రమంలో, తన‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ సర్కారు.. కన్సల్టెంట్, సూప‌ర్‌వైజ‌ర్‌, డిజైన‌ర్‌గా నియ‌మించిందంటూ వ‌స్తోన్న వార్త‌ల‌పై రాజ‌మౌళి మండిప‌డ్డారు. అందులో నిజం లేద‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపారు.

రాజ‌ధాని ప్రాంతంలో నిర్మాణాల‌కు ఇప్ప‌టికే నిపుణులు ఇచ్చిన డిజైన్లు ఫ‌స్ట్ క్లాస్‌గా ఉన్నాయ‌ని రాజమౌళి అభిప్రాయం వ్య‌క్తం చేశారు. సీఎం చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న టీమ్ కూడా ఈ విష‌యంలో సంతృప్తిక‌రంగానే ఉన్నార‌ని, అసెంబ్లీ డిజైన్ మ‌రింత బాగుండాల‌ని వారు కోరుకుంటున్నార‌ని తెలిపారు. రాజ‌ధాని విష‌యంలో తాను అందిస్తోన్న చిరుసాయం అమ‌రావ‌తి నిర్మాణ ప్రాజెక్టుకు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు విజన్‌ను నార్మన్ ఫోస్టర్ కంపెనీ ప్రతినిధులకు వివరించి, డిజైన్ల‌ ప్ర‌క్రియ త్వ‌ర‌గా జ‌రిగేందుకు సాయ‌ప‌డుతున్నాన‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News