arun jaitley: ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనగా రూ. 50 వేల కోట్లు సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం!

  • ద్రవ్యోల్బణం, యుద్ధ మేఘాలు, నోట్ల రద్దు ప్రధాన కారణాలు
  • ఇప్పటికే గణనీయంగా తగ్గిన ఆర్థిక వృద్ధి రేటు
  • యూపీఏ మాదిరి ప్యాకేజీలు ఉండవు
  • మోదీతో చర్చించిన తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తాం
  • ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

ఇండియాలో ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతుండటం, బ్యాంకుల్లో మూలధనం కొరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటం తదితర కారణాలతో పాటు, నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా ఇప్పటికే కుదేలైన భారత ఆర్థిక వృద్ధి, మరింతగా పడిపోనుందన్న విశ్లేషకుల అంచనాలతో నష్ట నివారణాయత్నాలను నరేంద్ర మోదీ సర్కారు ప్రారంభించింది.

ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలతో ఆర్థిక శాఖ చర్చలు జరపాలని, ఉద్యోగ సృష్టితో పాటు ఆర్థిక వృద్ధిని ముందుకు దూకించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సులు చేయాలని ప్రధాని కార్యాలయం సూచించింది. ఇదే విషయాన్ని జేపీ మోర్గాన్ నిర్వహించిన ఇండియా ఇన్వెస్టర్ సమ్మిట్ కార్యక్రమంలో వెల్లడించిన జైట్లీ, ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా   రూ. 50 వేల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని భావిస్తూ, అందుకు తగ్గ నిధులను సిద్ధం చేశామని అన్నారు.

అయితే, ఈ ప్యాకేజీ యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనగా మాత్రం ఉండబోదని అన్నారు. నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాదిరిగా తాము ఆలోచించడం లేదని తెలిపారు. ఈ ఏడాది ద్రవ్య లోటు అంచనాలను చేరుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అభిప్రాయపడ్డ ఆయన, తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి చురుకుగా పని చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక సూచికలను విశ్లేషిస్తున్నామని సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రధాని మోదీతో చర్చించిన తరువాత కొత్త ప్యాకేజీలపై నిర్ణయాలుంటాయని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

జీఎస్టీ అమలుకు కొన్ని సాంకేతికాంశాలు అడ్డుపడుతున్నాయని పేర్కొన్న ఆయన, చివరి సమయం వరకూ వేచి చూడకుండా కనీసం నాలుగైదు రోజుల ముందుగానే వ్యాపారులు తమ రిటర్నులను దాఖలు చేసుకోవాలని సూచించారు. ఆర్థిక సర్వే సందర్భంగా లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. దేశంలో విపక్షాల్లో రాజకీయ చైతన్యం లోపించిందని, వారు అవగాహన లేనివారిగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు గుప్పించారు. మూలధనం అవసరమైన ప్రభుత్వ బ్యాంకులను రీ క్యాపిటలైజేషన్ చేయనున్నట్టు పేర్కొన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు రూ. 10 వేల కోట్లను మూలధనం నిధులుగా తమ ప్రభుత్వం కేటాయించిందని జైట్లీ గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News