women reservation bill: ముందు మీవారితో మాట్లాడండి: మోదీకి సోనియా లేఖపై బీజేపీ ఎద్దేవా
- మిత్ర పక్షాలతో తొలుత మాట్లాడండి
- ములాయం, లాలూల కారణంగానే ఆగిన బిల్లు
- మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రయత్నించలేదు?
- విమర్శలు గుప్పించిన బీజేపీ అధికార ప్రతినిధి
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 'మహిళా బిల్లు'ను వెంటనే ఆమోదించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేఖ రాయడంపై బీజేపీ స్పందించింది. 2010లోనే రాజ్యసభలో మహిళా బిల్లుకు ఆమోదం పడిందని గుర్తు చేసిన సోనియా, ప్రస్తుతం లోక్ సభలో బీజేపీ బలం ఉన్నందున వెంటనే బిల్లును ఆమోదింపజేసుకోవాలని సూచించడాన్ని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తప్పుబట్టారు.
"ప్రధానికి లేఖ రాసే ముందు సోనియాగాంధీ, కాంగ్రెస్ మిత్ర పక్షాలతో మాట్లాడాలి. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ తదితరుల వంటి వారి కారణంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆలస్యం అవుతోంది" అని ఆయన అన్నారు. 2010 తరువాత నాలుగేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉందని గుర్తు చేసిన ఆయన, ఆ సమయంలో బిల్లును ఎందుకు పాస్ చేయించుకోలేదని ఎద్దేవా చేశారు.
మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన అడ్డంకని, వారు తలచుకుంటే ఎన్నడో బిల్లుకు ఆమోదం పడి వుండేదని అన్నారు. 1996 నుంచి బీహార్, యూపీ నేతలు ఈ బిల్లును అడ్డుకుంటున్నారని, ముఖ్యంగా ములాయం, లాలూ దీనిని వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికీ వారే అడ్డంకని అన్నారు.
కాగా, మహిళలకు కులాల వారీ రిజర్వేషన్లు కల్పిస్తూ, 33 శాతం కోటాను ఇవ్వాలని కొందరు వాదిస్తుండగా, కులాల కోటాను తీసేసి 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మరికొన్ని పార్టీలు పట్టుబడుతూ ఉండటంతో ఈ బిల్లు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే.