tirupati ruya: తిరుపతి రుయా ఆసుపత్రిలో ఉద్రిక్తత.. జూనియర్ డాక్టర్లు, సిబ్బంది మధ్య వివాదం!
- తిరుపతి రుయాలో జూనియర్ డాక్టర్లు, సిబ్బంది పోటాపోటీ ఆందోళనలు
- ఆత్మహత్యకు ప్రయత్నించిన జూనియర్ డాక్టర్ వెంకట రమణయ్య
- ఆందోళన తీవ్రతరం చేసిన జూనియర్ డాక్టర్లు
- వివాదానికి కారణమైన కృష్ణ కుమారిపై సస్పెన్షన్ వేటు వేసిన ఆసుపత్రి యాజమాన్యం
- ఆత్మహత్యాయత్నం చేసిన కృష్ణ కుమారి
- స్విమ్స్ కు తరలించిన సహోద్యోగులు
- ఆందోళన చేపట్టిన రుయా సిబ్బంది
చిత్తూరు జిల్లా తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూనియర్ డాక్టర్లు, ఇతర సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీ ఆందోళనలు చేయడం ఉద్రిక్తతకు కారణమైంది. జూనియర్ డాక్టర్లపై కృష్ణకుమారి దాడికి ప్రయత్నించారని, అనుచితంగా ప్రవర్తించారని చెబుతూ గత ఐదు రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ కుమారిపై చర్యలు తీసుకోలేదని ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ వెంకటరమణయ్య ఆత్మహత్యాయత్నం చేశారు.
ఆయనకు మద్దతుగా జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి, ఆందోళన తీవ్రతరం చేశారు. దీంతో స్పందించిన రుయా యాజమాన్యం కృష్ణకుమారిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ పర్యవసానంగా మనస్తాపం చెందిన కృష్ణకుమారి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. వేగంగా స్పందించిన సిబ్బంది ఆమెను స్విమ్స్ కు తరలించారు. దీంతో సిబ్బంది రంగంలోకి దిగారు. జూనియర్ డాక్టర్లకు ఎదురుగా నిలబడి సిబ్బంది నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది.