sadavati lands: తొలిసారి వేలానికి, రెండోసారి వేలానికి రూ. 40 కోట్లు తేడానా?: సదావర్తి వేలంపై సుప్రీం చీఫ్ జస్టిస్ ఆగ్రహం
- తొలిసారి వేలం పారదర్శకంగా ఉన్నట్టు కనిపించడం లేదు
- ట్రస్ట్ ఆస్తులను చౌకగా విక్రయిస్తుంటే చూస్తూ ఊరుకోబోము
- తమిళనాడు పిటిషన్ విచారణకు స్వీకరించేది లేదు
- స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సదావర్తి భూముల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తొలిసారి వేలానికి, రెండోసారి వేలానికి రూ. 40 కోట్లు తేడా ఉండటమేంటని ఏపీ సర్కారును ప్రశ్నించిన ఆయన, తొలిసారి వేలం పారదర్శకంగా జరిగినట్టు కనిపించడం లేదని అన్నారు. ట్రస్ట్ ఆస్తులు కాబట్టి తక్కువ ధరకు అమ్మితే కోర్టు కళ్లు మూసుకోబోదని స్పష్టం చేశారు.
ఇక ఈ కేసులో తమను కూడా భాగస్వామ్యం చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను అనుమతించేది లేదని తేల్చి చెప్పారాయన. ఆ భూములు సదావర్తి సత్రానివేనని స్పష్టంగా తెలుస్తోందని, అక్కడ జరిగిన ఆక్రమణలను తొలగించాల్సిన బాధ్యత తమిళనాడు సర్కారుదేనని చెప్పారు. అంతకుముందు ఏపీ ప్రభుత్వం తన వాదన వినిపిస్తూ, భూములను వేలంలో దక్కించుకున్న సంస్థ, ఇప్పుడు డబ్బు కట్టేందుకు ముందుకు రావడం లేదని తెలిపింది. రెండో స్థానంలో ఉన్న వ్యక్తికి డబ్బులు కట్టే విషయమై రేపు మధ్యాహ్నం వరకూ గడువుందని గుర్తు చేయగా, కేసు విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు.