goldfish: భారీ బంగారు చేపను పట్టి రికార్డు నెలకొల్పిన బాలిక!
- ఇంగ్లండ్‌కు చెందిన పదేళ్ల బాలిక లొయిస్ చివలర్స్ ఘనత
- 2.4 కిలోల బరువు, 13 అంగుళాల పొడవుతో ఉన్న గోల్డ్ ఫిష్
- గతంలో కిలోన్నర బరువున్న గోల్డ్ ఫిష్‌ను పట్టిన ఓ బాలుడు
నాలుగేళ్ల వయసు నుంచే చేపలు పట్టడం నేర్చుకున్న ఇంగ్లండ్‌కు చెందిన లొయిస్ చివలర్స్ (10) అనే ఓ బాలిక తాజాగా అతిపెద్ద బంగారు చేపను పట్టి రికార్డు నెలకొల్పింది. ఆ పాప పట్టిన గోల్డ్ ఫిష్ 2.4 కిలోల బరువు, 13 అంగుళాల పొడవు ఉంది. తన తండ్రితో కలిసి అప్పుడప్పుడు వెళ్లి, చేపలు పట్టడాన్ని అలవాటు చేసుకున్న ఆ బాలిక గతంలోనూ ఓసారి రెండు కిలోల చేపను పట్టింది.
తాజాగా తాను పట్టిన గోల్డ్ ఫిష్‌ను అందరికీ చూపించి, బరువు తూచి, ఫొటోలు తీసుకుని తిరిగి దాన్ని కొలనులో వదిలేసింది. గోల్డ్ ఫిష్ చేపలు 40 ఏళ్ల వరకు బతుకుతాయి. లొయిస్ చివలర్స్ కంటే ముందు ఈ రికార్డు నిక్ రిచర్డ్స్ అనే బాలుడి పేరిట ఉండేది. 2010లో డొర్సెట్‌లోని పూలె కొలనులో ఆ బాలుడు దాదాపు కిలోన్నర బరువున్న గోల్డ్ ఫిష్‌ను పట్టాడు. ఆ బాలుడి రికార్డును బద్దలు కొట్టిన లొయిస్ గురించి ఆమె తండ్రి గ్యారీ మాట్లాడుతూ.. తన కూతురికి చేపలు పట్టడమంటే చాలా ఇష్టమని చెప్పాడు.