గుత్తా సుఖేందర్ రెడ్డి: తాను రాజీనామా చేస్తున్నానని వస్తోన్న వార్తలపై తొలిసారి స్పందించిన గుత్తా సుఖేందర్ రెడ్డి
- ఆ వార్తలను సమర్థించను, వ్యతిరేకించను
- రాజీనామా విషయంలో సీఎందే తుది నిర్ణయం
- ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేస్తారన్నది కూడా ఆయనే నిర్ణయిస్తారు
తమ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన వారితో రాజీనామా చేయించాలని, మళ్లీ పోటీకి దిగితే తమ సత్తా చూపిస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సవాలు విసురుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ రోజు పాడి పరిశ్రమ అభివృద్ధిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై మొదటిసారిగా స్పందించారు. తాను రాజీనామా చేస్తున్నానని వచ్చిన వార్తలను సమర్థించను, వ్యతిరేకించను అని ఆయన వ్యాఖ్యానించారు.
తన రాజీనామా విషయంలో సీఎందే తుది నిర్ణయమని సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఒకవేళ తాను రాజీనామా చేస్తే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని కూడా అన్నారు. కాగా, రాష్ట్ర రైతుల సమన్వయ కమిటీపై ఉన్న మూడు ప్రత్యామ్నాయాలపై కేసీఆర్ చర్చిస్తున్నారని ఆయన అన్నారు.