china: ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన చైనా.. పాక్ కు వత్తాసు!
- కశ్మీర్ వివాదానికి ముగింపు పలకాలి
- జమ్ముకశ్మీర్ లోని హింసపై విచారణ జరపాలి
- దోషులను శిక్షించాలి
- కశ్మీర్ కు మానవహక్కుల కమిషన్ ను పంపించాలి
భారత్ పై విద్వేషాన్ని, పాకిస్థాన్ పై ప్రేమను మరోసారి ప్రదర్శించింది డ్రాగన్ కంట్రీ చైనా. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ సమస్యను చైనా లేవనెత్తింది. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడంలో అలసత్వం పనికిరాదని... ఈ వివాదానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లె కాంగ్ అన్నారు. పాకిస్థాన్, భారత్ లు కశ్మీర్ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇక, కశ్మీర్ వివాదం విషయంలో చైనాకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉందని చెప్పారు. 20 నిమిషాల పాటు కొనసాగిన తన ప్రసంగంలో... జమ్ముకశ్మీర్ లో చోటు చేసుకున్న హింసకు సంబంధించి విచారణ జరపాలని కూడా ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి తరపున మానవహక్కుల కమిషన్ ను కశ్మీర్ కు పంపాలని... అక్కడ ఇండియా చేస్తున్న మానవ హక్కుల అణచివేతను గుర్తించాలని చెప్పారు. బాధితులకు న్యాయం చేయాలని... దారుణాలకు పాల్పడినవారిని శిక్షించాలని అన్నారు.