ntr: ఎన్టీఆర్ పై సినిమా తీసేందుకు నా అనుమతి కావాలి.. కొడుకుల అనుమతి అవసరం లేదు!: లక్ష్మీపార్వతి
- ఎన్టీఆర్ సినిమాకు ఆయన భార్యనైన నా అనుమతే అవసరం
- సినిమాను పిచ్చిపిచ్చిగా తీస్తే ఊరుకోను
- ఎన్టీఆర్ వాదన, వేదన కనిపించాలి
- మా పెళ్లికి చంద్రబాబే సాక్ష్యం
'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నట్టు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. పైగా ఎన్టీఆర్ జీవితంలోని పలు మలుపులను తెరపై చూపిస్తానంటూ ఆయన చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. ఇప్పటికే పలువురు వర్మను టార్గెట్ చేశారు. తాజాగా ఈ సినిమా గురించి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ పై సినిమా తీయాలంటే భార్యగా తన అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె తెలిపారు. కుమారుల అనుమతి అవసరం లేదని అన్నారు. తమ ఇద్దరిపై తీసే సినిమాకు తానే అనుమతిని ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
తాను ఎన్టీఆర్ భార్యను కాదంటూ, తనను పదే పదే అవమానిస్తున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. తమ పెళ్లికి చంద్రబాబే ప్రత్యక్ష సాక్షి అని చెప్పారు. ఎన్టీఆర్ పై కచ్చితంగా సినిమా రావాల్సిందేనని అన్నారు. అయితే, ఎన్టీఆర్ జీవిత చరిత్రను సరైన రీతిలో చూపిస్తేనే తాను సహిస్తానని... పిచ్చి రాతలు, పిచ్చి కూతలు చూపిస్తే తానే ఎదురు తిరుగుతానని హెచ్చరించారు. ఎన్టీఆర్ వాదన, వేదనను చూపిస్తేనే మద్దతిస్తానని ఆమె ప్రకటించారు.