water bodies: జలాశయాల్లో చెత్త వేస్తే జైలుకే... కేరళ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్
జలాశయాలైన చెరువు, కుంట, నది, వాగు వంటి వాటిల్లో చెత్త వేయడం, మలవిసర్జన చేయడం వంటి పనులకు పాల్పడితే జైలు శిక్ష విధించేటట్లుగా కేరళ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. జలాశయాలను కలుషితం చేసే చర్యలకు పాల్పడితే రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, అందులో భాగంగానే ఈ ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు కేరళ నీటిపారుదల శాఖ మంత్రి మాథ్యూ టి. థామస్ తెలిపారు.
పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే నదులు, వాగులు, ప్రవాహాల్లో ఇటీవల ఎక్కువగా ప్లాస్టిక్ బాటిళ్లు, చెత్తాచెదారం కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ ఆర్డినెన్స్ నిర్ణయంపై మత్స్యకారులతోపాటు, ప్రకృతి ప్రియులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆర్డినెన్స్ కచ్చితంగా చట్టంగా మారుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.