Chandrababu: టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల వివరాలు ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- 17 మంది సభ్యులతో పొలిట్ బ్యూరో ఏర్పాటు
- ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు
- తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ
తెలుగు దేశం పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీల వివరాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా పొలిట్‌బ్యూరోలో రెండు మార్పులు చేసినట్లు, 17 మంది సభ్యులతో పొలిట్ బ్యూరో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇందులో తెలంగాణ నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి, సీతక్కలకు స్థానం దక్కింది. టీడీపీ జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడిగా కొనకళ్ల నారాయణరావు ఎంపికయ్యారు. అలాగే 105 మంది సభ్యులతో ఏపీ టీడీపీ, 114 మంది సభ్యులతో తెలంగాణ టీడీపీ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ నియమితులయ్యారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డిని ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలకు, నేతలకు కొన్ని సూచనలు చేశారు. క్రమశిక్షణగా ఉండాలని, మీడియాతో ఏది పడితే అది మాట్లాడకుండా ప్రజలతో మమేకమై వారి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. పదవుల ద్వారా పార్టీలో గుర్తింపు లభిస్తుందని, ఆ గుర్తింపును ఉపయోగించుకుని ప్రజలకు, పార్టీకి మేలు కలిగేలా చూడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. త్వరలో టీడీపీ అనుబంధ సంఘాలకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు.