Chandrababu: సాక్షి పత్రికపై చంద్రబాబు నిప్పులు.. ఏంటా రాతలు? అంటూ మండిపాటు
- మరీ ఇంత దుర్మార్గంగా రాస్తారా?
- ఆ రాతలు నీచాతి నీచం
- ఆంధ్రులను నీటి దొంగలు అంటారా?
- ప్రతిపక్ష నేత తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సాక్షి దినపత్రికలో కృష్ణా జలాలపై ప్రచురించిన వార్తపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటీ రాతలు? అంటూ నిప్పులు చెరిగారు. ఆ పత్రిక రాతలు దుర్మార్గంగా, నీచాతి నీచంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ వార్తను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ప్రజలందరూ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. తన క్యాంపు కార్యాలయంలో శనివారం ‘జలసిరి’ పాట ‘జల జల జల జలసిరికి హారతి.. జన జన జన జనసిరికి హారతి’ అంటూ సాగే పాటను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణా జలాలపై సాక్షి తెలంగాణ ఎడిషన్‌లో వచ్చిన వార్తను ప్రస్తావించారు. అందులో ఆంధ్రులను నీటి దొంగలుగా చిత్రీకరించారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్న జగన్, కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాళ్లను రెచ్చగొట్టే రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి వార్తలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. జగన్ తన పత్రికలో రాయిస్తున్న రాతలు నీచాతి నీచంగా, పరమ దుర్మార్గంగా ఉన్నాయన్నారు. ఆ రాతలతో జగన్ తీరు మరోమారు ప్రస్ఫుటమైందన్నారు. ఆ రాతలపై రాష్ట్రమంతా నిరసనలు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.