north korea: ట్రంప్ కాసుకో... మా రాకెట్లు వస్తున్నాయి: ఐరాస వేదికపై ఉత్తర కొరియా హెచ్చరిక
- ఐరాస వేదికపై ప్రసంగించేందుకు ఉత్తర కొరియాకు అవకాశం
- ట్రంప్ కు తీవ్ర హెచ్చరికలు పంపిన రీ యాంగ్ హో
- యూఎస్ ను తమ క్షిపణులు తాకుతాయని వెల్లడి
ఐక్యరాజ్యసమితి వేదికపై ఇప్పుడు ఉత్తర కొరియాకు అవకాశం లభించింది. గత వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ, ఉత్తర కొరియాను సర్వ నాశనం చేస్తానని వ్యాఖ్యానించగా, నేడు ఉత్తర కొరియా ప్రతినిధిగా మాట్లాడిన ఆ దేశ విదేశాంగ మంత్రి రీ యాంగ్ హో, అంతకుమించిన హెచ్చరికలు జారీ చేశారు. సరిగ్గా రీ యాంగ్ వేదికపై ప్రసంగించేందుకు రాగానే, అమెరికా యుద్ధ విమానాలు నార్త్ కొరియా తీరం మీదుగా దూసుకెళ్లాయి.
తమ బలాన్ని చూపించేందుకే అమెరికా ఈ పని చేసిందని తెలుస్తుండగా, తన ప్రసంగంలో రీ యాంగ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై విరుచుకుపడ్డారు. ఆయన మాటలను ప్రస్తావిస్తూ, దానికి ప్రతిగా తమ దేశపు రాకెట్లు అతి త్వరలో అమెరికా దేశాన్ని తాకుతాయని హెచ్చరించారు. యూఎస్ ప్రధాన భూభాగాలను తమ క్షిపణులు సందర్శిస్తాయని అన్నారు. కిమ్ జాంగ్ ఉన్ ను 'లిటిల్ రాకెట్ మ్యాన్' అని డొనాల్డ్ వ్యాఖ్యానించినందుకు ప్రతీకారంగా దాడులు తప్పవని రీ యాంగ్ తెగేసి చెప్పడం గమనార్హం.