modi: మన బలాన్ని చూపే సమయం వచ్చింది: నరేంద్ర మోదీ
- యువత వినూత్న ఆలోచనలు చేయాలి
- గాంధీ జయంతి సందర్భంగా ఖద్దరు బట్టలు కొనండి
- మత విశ్వాసాల పేరిట హింసా మార్గం వద్దు
- జాతిని ఏకం చేసిన మహనీయుడు సర్దార్
- పరిశుభ్రత వైపు అడుగులేస్తున్న భారతావని
- 'మన్ కీ బాత్'లో ప్రధాని నరేంద్ర మోదీ
- మూడేళ్లు పూర్తి చేసుకున్న 'మనసులో మాట'
ప్రపంచ దేశాలకు భారత యువత తన సత్తా చూపించే సమయం వచ్చిందని, ప్రతి ఒక్కరూ భారతావనిని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేసేందుకు తమ వంతు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. నేటి ఉదయం తన 36వ విడత 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి మాధ్యమంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రేడియో ద్వారా తన ప్రసంగాలు మూడేళ్ల పాటు సాగాయని గుర్తు చేశారు. ఈ మూడేళ్ల పయనంలో తాను అడిగినప్పుడల్లా విలువైన సలహా, సూచనలు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రానుందని, ఆ రోజు ప్రతి ఒక్కరూ ఖద్దరు దుస్తులు కొనుగోలు చేయాలని సూచించారు. మత విశ్వాసాల పేరిట హింసా మార్గంలో నడవటాన్ని సహించేది లేదని మరోసారి తేల్చి చెప్పారు.
కాశ్మీర్ యువకుడు బిలాల్ దార్, స్వచ్ఛ భారత్ కోసం చేస్తున్న కృషిని మోదీ ప్రశంసించారు. సర్దార్ పటేల్ జాతిని ఏకం చేశారని, ఆయన శ్రమకు ప్రతిఫలమే నేటి భారతావనని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం నానాజీ దేశ్ ముఖ్ పరితపించారని, ఆయన కన్న కలలు నేడు సాకారమవుతున్నాయని తెలిపారు. గాంధీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి వారు అధికారానికి దూరంగా ఉండి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం పొందారని మోదీ చెప్పారు.
'సర్వ జన హితాయ - సర్వ జన సుఖాయ' అన్నదే వారి నినాదమని, తానిప్పుడు దాన్నే పాటిస్తున్నానని వెల్లడించారు. తాను 'స్వచ్ఛ హీ సేవ' అన్న ఆలోచనను ముందుకు తెస్తే, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తన ఆలోచనకు పెద్ద ఎత్తున స్పందించిందని, ప్రజలు పరిశుభ్రత వైపు అడుగులు వేస్తున్నారని అన్నారు. ఇప్పటికే రెండు కోట్ల మందికి పైగా చిన్నారులు శుభ్రతపై వ్యాస రచన పోటీల్లో పాల్గొన్నారని, వేలాది మంది చిన్నారులు తమ చిత్రకళా ప్రతిభను చూపారని అన్నారు.
ఓ సర్పంచ్ తన కుమార్తెతో దిగిన సెల్ఫీని చూసిన తాను 'సెల్ఫీ విత్ డాటర్' అన్న ప్రచారం మొదలు పెడితే, దానికి అద్భుతమైన స్పందన వచ్చిందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఏ ఆహారాన్ని వృథా చేయరాదని, మిగిలిపోయే ఆహారాన్ని పాడు చేయకుండా సద్వినియోగం చేసేందుకు కృషి చేయాలని నరేంద్ర మోదీ సూచించారు. తదుపరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ప్రస్తావిస్తానని చెప్పిన ఆయన, 'ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్' కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జాతి యావత్తూ కదలి రావాలని కోరారు. సమీప భవిష్యత్తులో భారత యువత వినూత్న ఆలోచనలు చేసి ప్రపంచానికి మేలు కలిగించే ఉత్పత్తులను కనుగొనాలని పిలుపునిచ్చారు.