rahul gandhi: థ్యాంక్యూ సుష్మాజీ... కాంగ్రెస్ ను గుర్తించారు: రాహుల్ గాంధీ ట్వీట్... నెటిజన్ల ఎద్దేవా
- ఐరాసలో ఐఐటీల గురించి మాట్లాడిన సుష్మా
- వాటిని తామే నెలకొల్పామని గుర్తు చేసిన రాహుల్
- ప్రస్తావించినందుకు ధన్యవాదాలని ట్వీట్
- కుంభకోణాలు కూడా మీ హయాంలోనే జరిగాయంటున్న నెటిజన్లు
ఐక్యరాజ్యసమితి వేదికగా, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ వైఖరిని ఎండగట్టగా, ఆమె ప్రసంగంపై జాతి యావత్తూ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. తాజాగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సుష్మా స్వరాజ్ పై విభిన్నంగా స్పందిస్తూ, ఓ ట్వీట్ ను వదిలారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సాధించిన ఘనతలను బీజేపీ గుర్తించిందని ఓ వ్యంగ్య బాణాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు.
"సుష్మాజీ... మీకు థ్యాంక్స్. మీ ప్రసంగంలో ఐఐఎం, ఐఐటీల గురించి ప్రస్తావించారు. కనీసం ఈ రూపంలోనైనా కాంగ్రెస్ గొప్పతనాన్ని గుర్తించారు" అని అన్నారు. కాగా, ఇండియా ఐఐటీ, ఐఐఎంలతో విద్యావంతులను తయారు చేస్తుంటే, పాక్ ఉగ్రవాదులను ఉత్పత్తి చేస్తోందని సుష్మా స్వరాజ్ మాట్లాడిన సంగతి విదితమే. ఇండియాలో ఐఐటీలు, ఐఐఎంలను తామే నెలకొల్పామని గుర్తు చేస్తూ, రాహుల్ ఈ కామెంట్ చేయగా, నెటిజన్లు వెంటనే తమ విమర్శల ధాటిని చూపించారు. విద్యాసంస్థలతో పాటు పెద్ద పెద్ద కుంభకోణాలు సైతం కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఎద్దేవా చేస్తున్నారు. మీరు పార్టీ గురించి మాట్లాడుతున్నారని, సుష్మా దేశం గురించి మాట్లాడారని సెటైర్లు వేశారు.