Indian: భారత్‌పై పచ్చి అబద్ధంతో విషం కక్కి.. అంతర్జాతీయ వేదికపై అడ్డంగా దొరికిపోయిన పాక్!
- గాజా అమ్మాయిని చూపించి కశ్మీరీ యువతిగా చిత్రీకరించే ప్రయత్నం
- అంతర్జాతీయ సమాజం ముందు మరోమారు అభాసుపాలు
- భారత్ మతోన్మాదంతో ఊగిపోతోందని ప్రేలాపనలు
భారత్‌పై విషం కక్కడమే పనిగా పెట్టుకున్న పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికగా అతకని అబద్ధమాడి అడ్డంగా దొరికిపోయింది. ప్రపంచం ముందు నవ్వులపాలైంది. ఐరాస సర్వసభ్య సమావేశంలో గత మూడు రోజులుగా భారత్‌పై అసత్యాలతో విరుచుకుపడుతున్న పాక్ తాజాగా మరో అతి పెద్ద అబద్ధం ఆడి భారత్‌ను దోషిగా నిలబెట్టాలని చూసింది. అయితే అది బూమరాంగై చివరికి పాకిస్థాన్నే నవ్వుల పాలు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆదివారం ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ దౌత్యవేత్త మలీహా లోధీ మాట్లాడుతూ.. ముఖం నిండా పెల్లెట్ గన్స్ గాయాలతో ఉన్న ఓ బాలిక ఫొటోను చూపించారు. కశ్మీరీ యువతులపై భారత సైన్యం అకృత్యాలకు ఇంతకంటే నిదర్శనం మరోటి లేదని దుయ్యబట్టారు. భారత సైనికుల క్రౌర్యానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదని దుమ్మెత్తిపోశారు.
అయితే నిజానికి ఆమె చూపించిన బాలిక కశ్మీరీ కాదు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపడిన పాలస్తీనాలోని గాజాకు చెందిన బాలిక రవా అబు జోమా (17) ఫొటో అది. ఆమె గాయపడింది కూడా 2014లో. జెరూసలేంకు చెందిన హైదీ లెవీన్ అనే ఫొటో జర్నలిస్ట్ ఈ ఫొటో తీశాడు. అప్పట్లో ఈ ఫొటో సంచలనం సృష్టించింది. ఈ ఫొటోకు బహుమతులు కూడా అందుకున్నారాయన. ఇప్పుడు ఇదే ఫొటోను ఉపయోగించుకుని భారత్‌పై మరోమారు అభాండాలు వేయాలని పాక్ ప్రయత్నించింది. ఆమెను కశ్మీర్ యువతిగా చెప్పేందుకు ప్రయత్నించి అంతర్జాతీయ సమాజం ముందు పాక్ బొక్కబోర్లా పడింది. ఐరాసలో పాక్‌ను కడిగిపారేసిన భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలను ఖండించే తొందరలో పాక్ ఈ అతిపెద్ద అబద్ధానికి తెరలేపింది.
ఇక లోధీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. మోదీకి ముస్లింలను చంపిన చరిత్ర ఉందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఉగ్రవాదానికి భారత్ పుట్టినిల్లు అని, ఆ దేశం మతోన్మాదంతో ఊగిపోతోందని ఆరోపించారు.