BSE: నేడు 'బ్లాక్ మండే'... యుద్ధభయంతో ఆదిలోనే పాతాళానికి స్టాక్ మార్కెట్!
- ఐరాస వేదికగా ఒకరిపై ఒకరు నిప్పులు కురిపించుకున్న అమెరికా, ఉత్తర కొరియా
- ఇన్వెస్టర్లలో నశించిన సెంటిమెంట్
- సెషన్ ఆరంభంలోనే నష్టాలు
- 300 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్
ప్రపంచ స్టాక్ మార్కెట్లు మరో 'బ్లాక్ మండే' దిశగా సాగుతున్నాయి. గత వారాంతంలో ఐక్యరాజ్యసమితి వేదికగా, అమెరికా, ఉత్తర కొరియాలు తీవ్ర విమర్శలకు దిగి, హెచ్చరికలు జారీ చేసుకోవడంతో యుద్ధ భయాలు పెరుగగా, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించింది. దీంతో సోమవారం ఉదయం ప్రారంభమైన ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోగా, సెన్సెక్స్, నిఫ్టీలు సైతం అదే దారిలో నడిచాయి. ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే, 100 పాయింట్లకు పైగా నష్టంలో మొదలైన సెన్సెక్స్ కు రానురానూ నష్టం మరింతగా పెరిగింది.
ఈ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 300 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ ఒక శాతం నష్టంతో 31,625 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, 115 పాయింట్లు నష్టపోయి 9,848 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ-50లో 45 కంపెనీలు నష్టాల్లో నడుస్తుండటం గమనార్హం. అత్యంత కీలకమైన 9,850 పాయింట్ల స్థాయి వద్ద నిఫ్టీ మద్దతు కోల్పోవడంతో మరింత నష్ట భయాలు నెలకొన్నాయని మార్కెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఆసియా మార్కెట్లలో నిక్కీ మినహా మిగతా అన్నీ నష్టాల్లో కొనసాగాయి. స్ట్రెయిట్స్ టైమ్స్ 0.1 శాతం, హ్యాంగ్ సెంగ్ 1.01 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 1.09 శాతం, కోస్పీ 0.44 శాతం, జకార్తా కాంపోజిట్ 0.17 శాతం, షాంగై కాంపోజిట్ 0.36 శాతం నష్టపోయాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ సైతం నష్టాలను చూపిస్తున్నాయి. బంగారం ధర రూ. 47 పడిపోయి రూ. 29, 538 (పది గ్రాములు)కి చేరగా, వెండి ధర రూ. 87 పడిపోయి 39,640కి తగ్గింది. ముడి చమురు ధర రూ. 4 తగ్గి బ్యారల్ కు రూ. 3,283 వద్ద కొనసాగుతోంది.