illendu: ఇల్లెందులో టీఆర్ఎస్ నేతల ప్లెక్సీలను తొలగించిన మునిసిపల్ కమిషనర్... కార్యకర్తల దాడి
- మహమూద్ అలీ, తుమ్మలకు స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు
- వాటిని తొలగించిన మునిసిపల్ సిబ్బంది
- కమిషనర్ రవికుమార్ పై దాడికి దిగిన టీఆర్ఎస్ కార్యకర్తలు
- పార్టీ పట్టణ అధ్యక్షుడిపై కేసు నమోదు
భద్రాద్రి జిల్లా ఇల్లెందులో జరిగిన ప్లెక్సీల గొడవ మునిసిపల్ కమిషనర్ పై దాడికి కారణమైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, సింగరేణి ఉద్యోగ సంఘాలకు ఎన్నికలు జరుగనుండగా, టీఆర్ఎస్ తరఫున ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు నేడు పట్టణానికి రానున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు వారికి స్వాగతం పలుకుతూ, భారీ ఎత్తున నగరాన్ని ప్లెక్సీలతో అలంకరించారు. ఈ ప్లెక్సీలను మునిసిపల్ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో సిబ్బంది తొలగించడం వివాదాస్పదమైంది.
ప్లెక్సీలను తొలగించడాన్ని నిరసిస్తూ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కమిషనర్ రవికుమార్ పై టీఆర్ఎస్ నేతలు దాడి చేయడంతో ఆయనకు స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో నగరంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కమిషనర్ ఫిర్యాదు మేరకు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు.