hi sexy: బాలికతో దుర్భాషలాడినందుకు ఆర్నెల్ల జైలు శిక్ష విధించిన కోర్టు!
- అమ్మాయిని `హాయ్ సెక్సీ` అని పిలిచిన నిందితులు
- మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా కోర్టు తీర్పు
- ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం శిక్ష
బాలికను అసభ్య పదజాలంతో పిలిచినందుకు మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా కోర్టు ఇద్దరు యువకులకు ఆర్నెల్ల చొప్పున జైలు శిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధించింది. మార్చి 2015లో జరిగిన ఈ సంఘటనపై కోర్టు తీర్పునిచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక సాయంకాలం తన ఇంటికి వెళుతుండగా అవినాష్ భవేకర్, రవి భవేకర్లు ఆమెను `హాయ్ సెక్సీ` అని పిలిచారు. దీంతో బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అసభ్యంగా పిలవడంతో పాటు చేతుల్తో అశ్లీల సంజ్ఞలు కూడా చేశారని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును విచారించిన తర్వాత ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం అమ్మాయిని అవమానించిన కారణంగా శిక్ష విధించినట్లు కోర్టు తీర్పునిచ్చింది.