acb raids: జూనియర్ టెక్నికల్ ఇంజనీర్ నివాసంలోని బంగారం, కరెన్సీ, భూముల పత్రాలు చూసి నోరెళ్లబెట్టిన ఏసీబీ అధికారులు!
- జూనియర్ టెక్నికల్ ఇంజనీర్ నివాసంలో డబ్బే డబ్బు..ఐటీ అధికారుల షాక్
- 15 కేజీల బంగారు నగలు
- 50 కేజీల వెండి ఆభరణాలు
- 10 లక్షల రూపాయల నగదు
- మనీ కౌంటింగ్ మెషీన్
విజయవాడలో జూనియర్ టెక్నికల్ ఇంజనీర్ గా పని చేస్తున్ననల్లూరి వెంకట శివప్రసాద్ నివాసంపై దాడులు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు షాక్ కు గురయ్యారు. ఏపీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నతాధికారిగా పని చేస్తున్న రఘు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడి పెద్దమొత్తంలో అక్రమాస్తులు, డబ్బు సంపాదించారన్న ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయనకు సంబంధించిన విశాఖ, విజయవాడల్లోని నివాసాలతో పాటు, బంధువులు, స్నేహితుల ఇళ్లపై దాడులు చేయగా, పలువురు ఆయనకు బినామీలుగా ఉన్నట్టు గుర్తించారు. అందులో శివప్రసాద్ పేరు కూడా ఉండడంతో ఆయన నివాసంపై దాడులు నిర్వహించారు.
ఆయన నివాసంపై దాడులు చేసిన ఎసీబీ అధికారులు షాక్ తిన్నారు. ఆయన నివాసంలోని మాసిన బట్టలు, వాషింగ్ మెషీన్ కింద, మంచంకింద, బీరువా సొరుగుల్లో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా బంగారు ఆభరణాలు దొరికాయి. బంగారు విగ్రహాలు కూడా లభ్యమయ్యాయి. వివిధ వస్తువులు, దిమ్మలు, బిస్కెట్ల రూపంలో 50 కేజీల వెండి లభించడం విశేషం. అలాగే ఆయన నివాసంలో 10 లక్షల రూపాయల నోట్ల కట్టలు లభ్యమయ్యాయి.
అలాగే గన్నవరం సమీపంలో 300 ఎకరాల వెంచర్ కు సంబంధించిన పత్రాలు కూడా దొరికాయన్న వార్తలు వెలువడుతున్నాయి. గన్నవరంలోని ప్రస్తుతం ఆయన నివాసం ముందే 40 సెంట్ల భూమి ఉన్నట్టు గుర్తించారు. అలాగే షిర్డీలో ఒక లాడ్జి, వేల్పూరులో రెండెకరాల వ్యవసాయ భూమి, విజయవాడలో 16 ఫ్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. అంతే కాకుండా డబ్బులు లెక్కించేందుకు ఆయన నివాసంలోనే మనీ కౌంటింగ్ మెషీన్ కూడా ఉండడం విశేషం. ఇవన్నీ చూసి కళ్లు చెదిరిన ఏసీబీ అధికారులు లెక్కింపు ప్రారంభించారు.